Middlesex County League: ఇంగ్లాండ్ లోని మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో జరిగిన ఓ లోయర్ డివిజన్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని స్కోరు నమోదైంది. రిచ్‌మండ్ క్రికెట్ క్లబ్ (Richmond CC) 4 జట్టు, నార్త్ లండన్ క్రికెట్ క్లబ్ మూడో జట్టుతో జరిగిన 45 ఓవర్ల మ్యాచ్‌లో ఘోరంగా ఓడింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రిచ్ మండ్ జట్టు అనంతరం వారు తీసుకున్న నిర్ణయం జీవితాంతం మర్చిపోలేనిదిగా అయ్యింది. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన నార్త్ లండన్ క్రికెట్ క్లబ్ లో నార్త్ లండన్ జట్టు ఓపెనర్ డాన్ సిమ్మన్స్ 140 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఆ తర్వాత బౌలర్ల దయతో ‘ఎక్స్‌ట్రాలు’ (extras) రూపంలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 92 పరుగులు (63 వైడ్లు) ఇవ్వడంతో మొత్తం 45 ఓవర్లలో వారు 426 పరుగులు చేశారు. ఇక ఈ భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన రిచ్‌మండ్ జట్టు, నార్త్ లండన్ జట్టు బౌలర్ల ధాటికి దాసోహం అయ్యింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరగా, కేవలం నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాడు ఒక పరుగు చేశాడు. ఇంకో పరుగు వైడ్ బంతితో వచ్చింది. ఇలా మొత్తంగా జట్టు 5.4 ఓవర్లలో 2 పరుగులకు ఆలౌటైంది.
ఇక నార్త్ లండన్ బౌలర్ మ్యాట్ రోసన్ ఏకంగా ఒక పరుగూ ఇవ్వకుండా 5 వికెట్లు తీయగా, అతని భాగస్వామి స్పాటన్ 3 వికెట్లు తీశాడు. ఓ ఆటగాడు రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ విజయం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన విషయంపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ తో నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ఇందులో కొందరు ఇంత దారుణమైన స్కోరు కార్డు నేను ఎప్పుడూ చూడలేదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో, మీకన్నా గల్లీ క్రికెటర్స్ మేలు కదయ్యా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రిచ్‌మండ్ డిప్యూటీ ఛైర్మన్ స్టీవ్ డీకిన్ వివరణ ఇస్తూ.. ఈ పరాజయానికి కారణం జట్టులోని అనేక మంది ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో, క్లబ్ అత్యవసరంగా క్రికెట్ ఆడని వారి సాయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తంగా ఈ మ్యాచ్ ద్వారా క్లబ్ క్రికెట్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 426 పరుగుల తేడాతో ఓటమిని రిచ్‌మండ్ జట్టు రికార్డ్ క్రియేట్ చేసింది.
