మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఈ విమానం, 227 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 239 మందితో అదృశ్యమైంది. దాదాపు పదేళ్లు గడిచినా, ఈ విమానం ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. దీనికోసం ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి.
2014 మార్చి 8.. అర్ధరాత్రి సమయం.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయం సందడిసందడిగా ఉంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనా రాజధాని బీజింగ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరింది MH370 విమానం. ఈ బోయింగ్ 777- 200ER విమానం అత్యాధునిక సాంకేతికతతో తయారైంది. రెండు రోల్స్-రాయిస్ ట్రెంట్ 892 ఇంజన్‌లు ఇందులో ఉన్నాయి. 282 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. విమానం రాత్రి 12 గంటల 41నిమిషాలకు టేకాఫ్ అయింది. కాసేపటికే.. అంటే ఒంటి గంట ఒక నిమిషానికి అది 35వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా 53 ఏళ్ల అనుభవజ్ఞుడైన పైలట్. అతనికి తోడుగా ఫస్ట్ ఆఫీసర్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ఉన్నారు. ఆయన వయసు 27 ఏళ్లు. వీళ్లిద్దరూ ఆ విమానాన్ని నడిపారు.
అంతవరకూ బాగానే ఉంది. ప్రయాణికులు కూడా చిన్నగా నిద్రలోకి జారుకుంటున్నారు. పైలెట్లు కూడా ATCతో తమ ప్రయాణ వివరాలను పంచుకుంటున్నారు. విమానం టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత, సౌత్ చైనా సీ మీదుగా వెళుతోంది MH370 విమానం. కెప్టెన్ జహారీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్- ATCతో చివరిగా మాట్లాడాడు. “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో” అని ఆయన చెప్పారు. ఇవే ఆయన చెప్పిన చివరి మాటలు. ఆ తర్వాత, విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. దాని ట్రాన్స్ పాండర్ ఆఫ్ అయిపోయింది. ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్ లేకుండానే అది మాయమైంది.
MH370 విమానం అదృశ్యమైన కొద్ది గంటల్లోనే మలేషియా ఎయిర్‌లైన్స్ దాన్ని కోల్పోయినట్లు ప్రకటించింది. సౌత్ చైనా సీలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఎందుకంటే అక్కడే విమానం చివరిసారిగా రాడార్‌లో కనిపించింది. అదృశ్యమైన MH370కోసం 34 ఓడలు, 28 విమానాలతో కూడిన అంతర్జాతీయ బృందం గాలింపు చేపట్టింది. అయితే, కొద్ది రోజుల్లోనే మలేషియా సైన్యం ప్రైమరీ రాడార్ డేటా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. MH370 తన రూట్ నుంచి పశ్చిమ దిశగా తిరిగి, మలే పెనిన్సులా మీదుగా, స్ట్రెయిట్ ఆఫ్ మలాక్కా దిశగా వెళ్లింది. ఆ తర్వాత అది అండమాన్ సీ వైపు ప్రయాణించి, రాడార్ రేంజ్ నుంచి మాయమైంది.
ఈ సమాచారం గాలింపు దిశను పూర్తిగా మార్చేసింది. అదే సమయంలో ఇన్‌మార్‌శాట్ శాటిలైట్ డేటా.. విమానం దక్షిణ హిందూ మహాసముద్రం వైపు వెళ్లి ఉండవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌షేక్ డేటా ఆధారంగా, విమానం ఏడు గంటల పాటు ఆటోపైలట్‌లో ఎగిరి, ఇంధనం అయిపోయి కూలిపోయి ఉండవచ్చని అనుమానించారు. ఈ డేటా ఆధారంగా, ఆస్ట్రేలియా నేతృత్వంలో విస్తృతమైన సముద్ర గాలింపు మొదలైంది. 2014 ఏప్రిల్ లో ఆస్ట్రేలియన్ ఓడలు దక్షిణ హిందూ మహాసముద్రంలో అకౌస్టిక్ పింగ్‌లను గుర్తించాయి. ప్రతి గంటకోసారి విమానం, శాటిలైట్ మధ్య కనెక్షన్ గుర్తించేందుకు ఈ పింగ్స్ దోహదపడతాయి. ఇవి విమానం బ్లాక్ బాక్స్ నుంచి వచ్చినవై ఉండొచ్చని భావించారు. అయితే, ఈ పింగ్‌లు రోజులు గడిచేకొద్దీ ఆగిపోయాయి. బ్లాక్ బాక్స్ బ్యాటరీ డెడ్ అయిపోయినందు వల్ల ఇలా ఆగిపోయి ఉండొచ్చని భావించారు. తర్వాత రోబోటిక్ సబ్‌మెర్సిబుల్స్ ఉపయోగించి సముద్ర గర్భంలో గాలింపు జరిగింది. కానీ ఫలితం శూన్యం.
అయితే 2015 జూలైలో ఒక పెద్ద పురోగతి కనిపించింది. రీయూనియన్ దీవిలో విమాన రెక్క భాగం దొరికింది. ఇది MH370దేనని ధృవీకరించబడింది. ఆ తర్వాత మడగాస్కర్, మారిషస్, దక్షిణాఫ్రికా తీరాల్లో మరికొన్ని శకలాలు కనిపించాయి. మొత్తం 20 శకలాలు లభ్యమైనప్పటికీ అవి విమానం ఎక్కడ కూలిందనేదానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారం మాత్రం దొరకలేదు. ఆస్ట్రేలియా, మలేషియా, చైనా సంయుక్తంగా లక్ష 20వేల చదరపు కిలోమీటర్ల సముద్ర గర్భాన్ని శోధించాయి. అయినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే 150 మిలియన్ డాలర్లను ఈ విమానం ఆచూకీకోసం ఖర్చు పెట్టారు. ఫలితం లేకపోవడంతో 2017 జనవరిలో గాలింపు ఆపేశారు. అయితే, 2018లో ఓషన్ ఇన్ఫినిటీ అనే అమెరికన్ మెరైన్ రోబోటిక్స్ సంస్థ “నో ఫైండ్, నో ఫీ” పద్ధతిలో మరో గాలింపును చేపట్టింది. అంటే విమానాన్ని కనుగొంటేనే డబ్బు చెల్లిస్తారు.. లేకుంటే లేదు. కానీ అది కూడా విఫలమైంది.
MH370 అదృశ్యంపై ఎంతోమంది ఎన్నో రకాల వాదనలు వినిపించారు. కానీ వాటికి సంబంధించి ఏ ఒక్కటీ పూర్తిగా రుజువు కాలేదు. దీంతో ఈ విమానం అదృశ్యం మిస్టరీగానే ఉండిపోయింది. MH370 అదృశ్యం వెనుక 3-4 కారణాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో మొదటిది- రోగ్ పైలట్ థియరీ: దీని ప్రకారం, కెప్టెన్ జహారీ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని దక్షిణ హిందూ మహాసముద్రంలో కూల్చి ఉండొచ్చు. ఆయన ఇంట్లోని ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ఈ రూట్‌ను ప్రాక్టీస్ చేసినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఆయన మానసిక స్థితి గురించి కానీ, అతని ఉద్దేశాల గురించికానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇక రెండోది – హైజాకింగ్: విమానాన్ని ఎవరో హైజాక్ చేసి ఉండవచ్చని కొందరు భావించారు. ఇద్దరు ప్రయాణికులు దొంగ పాస్‌పోర్ట్‌లతో ప్రయాణించారనే విషయం ఈ సిద్ధాంతానికి ఊతమిచ్చింది, కానీ వారు ఆశ్రయం కోసం వెళుతున్న ఇరానియన్లని తేలింది. ఇక మూడోది- మెకానికల్ ఫెయిల్యూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడి ఉండొచ్చు. ఆక్సిజన్ కొరత వల్ల సిబ్బంది స్పృహ కోల్పోయి ఉండొచ్చు. విమానం ఆటోపైలట్‌లో కూలిపోయి ఉండవచ్చు. అయితే ఏవీ నిర్ధారణ కాలేదు. కానీ, విమానం తిరిగిన విధానం ఈ సిద్ధాంతాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇక నాలుగోది- కుట్ర సిద్ధాంతం: అమెరికా సైన్యం విమానాన్ని కూల్చిందని లేదా అది రష్యా ద్వారా దారి మళ్లించబడిందని కొన్ని విపరీత ఊహాగానాలు వచ్చాయి, కానీ వేటికి ఆధారాలు లేవు. 2018లో మలేషియా ప్రభుత్వం అధికారికంగా ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం విమానం ఉద్దేశపూర్వకంగానే రూట్ మార్చబడింది. కానీ దానికి ఎవరు బాధ్యులో చెప్పలేకపోయింది. “విమాన శకలాలు దొరకనంత వరకూ స్పష్టమైన సమాధానం లభ్యం కాదు” అని నివేదిక తేల్చింది.
MH370 విమానం అదృశ్యమై పదేళ్లు దాటినా ఇప్పటికీ ప్రయాణికుల కుటుంబీకులు తమవారికోసం ఆరా తీస్తూనే ఉన్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. MH370లో మొత్తం 15 దేశాలకు చెందిన ప్రయాణికులున్నారు. వీళ్లలో ఎక్కువగా 153 మంది చైనా దేశానికి చెందిన వారున్నారు. ప్రయాణికుల కుటుంబాలు సమాధానాల కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నాయి. చైనా ప్రభుత్వం మలేషియాపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఫలితం లేకపోయింది. మలేషియా ప్రభుత్వం మొదట్లో సరిగా స్పందించలేదు. దీంతో అనేక విమర్శలు ఎదుర్కొంది. 2014లోని ప్రధాని నజీబ్ రజాక్, విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని ప్రకటించారు. అయితే దానికి ఆధారాలు దొరకలేదు. ప్రయాణికుల కుటుంబాలు “వాయిస్ 370” అనే సంస్థను ఏర్పాటు చేసి, గాలింపు కొనసాగించాలని కోరుతున్నాయి.
విమానం కూలిన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ దీనికోసం గాలింపు మొదలవుతోంది. ఇందుకోసం మలేషియా ప్రభుత్వం ఓషన్ ఇన్ఫినిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2024 డిసెంబర్‌లో మలేషియా ప్రభుత్వం ఓషన్ ఇన్ఫినిటీతో కొత్త ఒప్పందాన్ని ప్రకటించింది. “నో ఫైండ్, నో ఫీ” పద్ధతిలో.. విమాన శకలాలు కనుక్కుంటే $70 మిలియన్లు చెల్లిస్తామని తెలిపింది. అందులో భాగంగానే ఓషన్ ఇన్ఫినిటీ తమ ఓడలను దక్షిణ హిందూ మహాసముద్రంలోకి పంపించి గాలింపు మొదలుపెట్టింది. 15వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 నెలల పాటు ఈ గాలింపు జరుగుతుందని సమాచారం.
MH370 అదృశ్యం ఒక మిస్టరీ. అత్యాధునిక కాలంలో కూడా ఓ విమానాన్ని కనుక్కోలేకపోవడం మన టెక్నాలజీలోని పరిమితులను తెలియజేస్తోంది. మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని గుర్తు చేస్తోంది. ఈ విమానం ఎక్కడుంది? ఎందుకు అదృశ్యమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించే వరకూ, ఈ కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. కొత్త గాలింపు విజయవంతమై, ఈ రహస్యం వీడితే, అది కేవలం ఒక విమాన ఆచూకీ కనుగొనడమే కాదు, 239 కుటుంబాలకు శాంతిని చేకూరుస్తుంది.