Sandhya Devanathan: ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలుతున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థలు మెటాలో భాగమయ్యాయి. అయితే ఆయా సంస్థలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్య దేవనాథన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఆమె నేపథ్యం గురించి చాలా మందికి తెలియదు. 46 ఏళ్ల సంధ్య దేవనాథన్ ఏపీలోని విశాఖలోనే చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1994లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. అనంతరం 2014లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ‘లీడర్‌షిప్’ కోర్స్ పూర్తి చేశారు. సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన తరువాత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో చేరి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
2016 జనవరిలో ఫేస్‌బుక్‌లో చేరిన సంధ్య దేవనాథన్ నాలుగేళ్లకు పైగా అక్కడే పనిచేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో మెటా మేనేజింగ్ డైరెక్టర్(సింగపూర్), మెటా బిజినెస్ హెడ్ (వియత్నాం)గా పనిచేశారు. మెటాకు సంబంధించి ఆగ్నేయాసియా ఇ–కామర్స్ వ్యవహారాలను పర్యవేక్షించారు. మెటా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకటన వచ్చే వరకు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గేమింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Read Also: IFFI: ఇఫీలో తెలుగు సినిమాలకు పెద్ద పీట!
వ్యక్తిగత విషయానికి వస్తే.. సంధ్య దేవనాథన్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తున్నారు. ఆమె ఒక విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. ఆమెకు విలువైన అపార్టుమెంట్లతో పాటు చాలా బ్రాండెడ్ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. పేరుమోసిన కంపెనీల్లో పదవులు సంపాదించి ఆదాయం సమకూర్చుకున్నారు. 2022 నాటికి సంధ్యా దేవనాథన్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కాగా సిటీబ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసినా, మెటా లాంటి సంస్థలో బాస్‌గా కీలక విధులు నిర్వహించినా నేర్చుకోవడాన్ని మాత్రం సంధ్య ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తులు మొదలుకుని సామాజిక పరిస్థితుల వరకు ఎన్నో విషయాలు నేర్చుకొని తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ప్రసిద్ధ విద్యాలయాల్లో నేర్చుకున్న పాఠాలు ఎన్నో సందర్భాలలో తనకు దారి చూపాయని సంధ్యా దేవనాథన్ వెల్లడించారు.
