Site icon NTV Telugu

Medicine Prices: సామాన్యులపై మరో భారం.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు

దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందుల ధరలు పెరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో జ్వరం, ఇన్ఫెక్షన్స్‌, గుండె జ‌బ్బులు, హైబీపీ, చ‌ర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉప‌యోగించే ఔషధాల ధరలు పెర‌గ‌నున్నాయి. ఈ మేరకు ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసిట‌మాల్‌, ఫెనోబ‌ర్బిటోన్‌, అజిత్రోమైసిన్‌, సిఫ్రాన్‌, హైడ్రోక్లోరెడ్‌, మెట్రిండ‌జోల్ వంటి మందుల ధ‌ర‌లు ప్రజలకు భారం కానున్నాయి. 2021 క్యాలెండ‌ర్ సంవ‌త్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డ‌బ్ల్యూపీఐ)లో 10.7 శాతం స‌వ‌రించిన‌ట్టు ఎన్‌పీపీఏ అధికారులు వెల్లడించారు. క‌రోనా కార‌ణంగా ఔష‌ధాల‌ తయారీ ఖర్చులు కూడా పెరగడంతో వాటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నట్లు తెలుస్తోంది.

https://ntvtelugu.com/zomato-founder-clarity-on-10-minites-food-delivery-news/
Exit mobile version