గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తూ.. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను సిద్దం చేసినట్లు తెలిపారు. మొదటి ఛాలెంజ్ లో అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల సంస్థ సిబ్బందికి, రెండో ఛాలెంజ్ లో 45 వేల ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, హెల్త్ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వైద్య పరీక్షల్లో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 450 మంది ఉద్యోగుల ప్రాణాలను సంస్థ కాపాడగలిగిందని అన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి ఏటా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంస్థ భావిస్తోందని తెలిపారు.
సిబ్బంది సంక్షేమానికి టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రాముఖ్యత ఇస్తోందన్నారు. బకాయిల విషయంలో సానుకూలంగా వ్యవహారిస్తూ.. డీఏలు, ఇన్సెంటివ్‌లను ఇచ్చిందని చెప్పారు. 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్‌మెంట్ తో అమలు చేస్తూ.. సిబ్బందికి మే నెల నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని, ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని హెల్త్ వలంటీర్లకు సూచించారు. ప్రతి ఒక్క సిబ్బందిని తమ కుటుంబ సభ్యుడిలాగా భావించి సేవ చేయాలన్నారు. మార్కెట్‌లో వస్తోన్న పోకడలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని.. సంస్థ వృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
హెల్త్ వలంటీర్లకు సన్మానం
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-2 అమలులో అత్యుత్తమ పనితీరును కనబరిచిన హెల్త్ వలంటీర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు. టాప్ 10 హెల్తీ డిపోలైన గద్వాల్, బర్కత్‌పుర, మంథని, పరిగి, తాండూరు, కాచిగూడ, దేవరకొండ, తొర్రూర్, ముషీరాబాద్-2, బాన్సువాడకు చెందిన హెల్త్ వలంటీర్లు కృష్ణపాల్, హుస్సేనమ్మ, మహ్మద్ ఇర్ఫాన్, మమత, సునిత, రాజాబాబు, పర్వతమ్మ, అసిఫ్, శోభ, శేఖర్, రమేశ్, రమాదేవి, రామకోఠి, చారి, సతీశ్, ఉమ, మాధూరి, కుమార్, సంతోష్, విజయలను ఆయన సన్మానించి.. ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కృష్ణకాంత్, సీపీఎం ఉషాదేవి, సీటీఎం శ్రీదేవి, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, కాల్ హెల్త్ సంస్థ ప్రతినిధి అమీనుల్లా, తదితరులు పాల్గొన్నారు.