Site icon NTV Telugu

Crime News: లవర్ మోజులో పడి.. కన్న కూతురునే కడతేర్చిన కసాయితల్లి!

Medak Murder Case

Medak Murder Case

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని, కన్న పిల్లలను కూడా కాదనుకుంటున్నారు కొంత మంది మహిళలు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సంచలనం కలిగిస్తున్నాయి. అంతే కాదు.. ప్రియుడి కోసం కట్టుకున్న వాడినో లేదా కన్న పిల్లలనో చంపేస్తున్నారు. చివరికి పోలీసు కేసులతో కటకటాలపాలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో లవర్ మోజులో పడి కూతురును కడతేర్చింది ఓ కసాయి తల్లి.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లికి చెందిన బంటు మమత.. తన రెండేళ్ల కూతురిని తీసుకొని ప్రియుడితో కలిసి ఏపీకి పారిపోయింది. అక్కడ కూతురిని హత్య చేసిన అనంతరం డెడ్‌‌బాడీని బైక్‌‌పై స్వగ్రామానికి తీసుకొచ్చి పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయింది. చివరకు పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో చిన్నారి హత్య విషయం బయటపడింది.

శభాష్‌‌పల్లికి చెందిన బంటు మమతకు రాయపోల్‌‌ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి కొడుకు చరణ్‌‌, కూతురు తనుశ్రీ ఉన్నారు. మమతకు ఏడాది కిందట శభాష్‌‌పల్లికి చెందిన ఫయాజ్‌‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఫయాజ్‌‌, మమత గత మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఐతే భర్త భాస్కర్‌‌ ఫిర్యాదుతో మిస్సింగ్‌‌ కేసు నమోదు చేసిన రాయపోల్‌‌ పోలీసులు.. ఇద్దరిని హైదరాబాద్‌‌లో పట్టుకున్నారు. తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దల సమక్షంలో మమతకు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు.

అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో మే 21న శభాష్‌‌పల్లిలో ఉన్న మమత.. తన కూతురు తనుశ్రీని తీసుకొని మరోసారి ఫయాజ్‌‌తో వెళ్లిపోయింది. మమత తండ్రి ఫిర్యాదుతో శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు ఏపీలోని నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఇద్దరినీ శివ్వంపేటకు తీసుకొచ్చి చిన్నారి గురించి అడిగారు. ఆ సమయంలో చిన్నారిని హత్య చేసిన విషయం బయటపడింది.

జూన్‌‌ 7న తనుశ్రీని గొంతు నులిమి చంపేసినట్లు మమత ఒప్పుకుంది. అంతే కాదు.. బైక్‌‌పై నరసరావుపేట నుంచి శభాష్‌‌పల్లికి తీసుకొచ్చి గ్రామ శివారులోని కాల్వ పక్కన పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కాల్వ పక్కన తవ్వి చిన్నారి డెడ్‌‌బాడీని బయటకు తీశారు పోలీసులు. అక్కడే పోస్ట్‌‌మార్టం చేయించి చిన్నారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసిన తమ కూతురు మమతను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈ కేసులో ప్రియుడు ఫయాజ్‌తోపాటు మమతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version