NTV Telugu Site icon

Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు

New Project (27)

New Project (27)

బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారానికి దూరమవుతాయని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి జావేద్ సిమ్నానీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో అధికారానికి దూరమైందన్నారు. అదే విధంగా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, ఓటింగ్ యంత్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటే బీజేపీ కూడా అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

READ MORE: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..

హిందుత్వ ముసుగులో మైనారిటీలపై దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయని బీఎస్పీ చీఫ్ పేర్కొన్నారు. దీనికి తోడు పేద అగ్రవర్ణాల వారి పరిస్థితి కూడా బాగా లేదన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వేధింపులకు గురవుతోందని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బహుజన నాయకుల పేర్లతో ఉన్న జిల్లాల పేర్లను మార్చిందన్నారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ముస్లిం సమాజంపై దోపిడీ, అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి దోపిడీ, అణచివేతలను అరికడటామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతున్నాయని..అవినీతి ఇంకా అంతం కాలేదని చెప్పారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే యావత్ సమాజ సంక్షేమానికి భరోసా ఇస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఏడో దశలో భాగంగా జూన్ 1న గోరఖ్‌పూర్‌లో ఓటింగ్ జరగనుంది.