NTV Telugu Site icon

Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!

Mayank Agarwal Health Update

Mayank Agarwal Health Update

టీమిండియా క్రికెటర్‌, కర్ణాటక కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్‌ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం విమానంలో తన ముందు ఉన్న ద్రవ పదార్థాన్ని మంచి నీళ్లు అనుకుని తాగడంతో.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన అగర్తలలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మయాంక్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మయాంక్‌ నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.

మయాంక్ అగర్వాల్ జనవరి 26-29 మధ్య అగర్తలలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో మయాంక్ 51, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత మయాంక్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. సీటు ముందున్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే అతడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని అగర్తలలో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు.

Also Read: Budget Sessions 2024: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది: ద్రౌపది ముర్ము

రంజీ ట్రోఫీలో భాగంగా మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని కర్ణాటక జట్టు ఫిబ్రవరి 2వ తేదీన తన తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. సూరత్‌లో రైల్వేస్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. మయాంక్ ఈ మ్యాచ్‌లో ఆడగలడా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మయాంక్ గత కొంతకాలంగా భారత జట్టులో ఆడలేదు. 5 ఫిబ్రవరి 2020న హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. 4 సెంచరీల సహాయంతో టెస్టులో 1488 పరుగులు చేయగా.. వన్డేల్లో 86 పరుగులు చేశాడు.