NTV Telugu Site icon

Mayank Agarwal: విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్!

Mayank Agarwal

Mayank Agarwal

Indian Cricketer Mayank Agarwal files police complaint: భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో సీటు ముందున్న ప్లాస్టిక్‌ కవర్‌లో మంచినీళ్లుగా భావించి హానికర ద్రవం తాగడంతో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.

మయాంక్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్. అతడి ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. అయితే మయాంక్‌ మేనేజర్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్సీసీపీఎస్ (న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్)కి ఫిర్యాదు చేసారు’ అని ఎస్పీ వెస్ట్ త్రిపుర కిరణ్ కుమార్ తెలిపారు. ‘మయాంక్‌ విమానంలో కూర్చున్నప్పుడు అతని ముందున్న ద్రవాన్ని కొద్దిగా తాగాడు. అకస్మాత్తుగా అతని నోటిలో ఇబ్బంది మొదలైంది. ఒక్కసారిగా అతను మాట్లాడలేకపోయాడు. మయాంక్‌ నోటిలో వాపు మరియు బొబ్బలు వచ్చాయి. ప్రస్తుతం మయాంక్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని మయాంక్‌ మేనేజర్ పోలీసులకు తెలిపాడు.

Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. విరాట్‌ కోహ్లీ దూరం!

రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటకం కోసం కర్ణాటక టీమ్ అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ అయిన మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో బయలుదేరాడు. సీటు ముందున్న కవర్‌ (పౌచ్‌)లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే మయాంక్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. వైద్యుల సూచనల మేరకు మయాంక్‌ను బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.