NTV Telugu Site icon

Matthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రపంచకప్‌ విన్నర్‌!

Matthew Wade Retirement

Matthew Wade Retirement

ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై తన చివరి మ్యాచ్‌ ఆడాడు. 2021 నుంచి వన్డే, టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ 2021 గెలిచిన జట్టులో వేడ్‌ సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాది ఆస్ట్రేలియాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

13 ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ వేడ్‌ 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి.. 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు 13 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బ్రాడ్ హాడిన్ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగడంతో వేడ్‌ జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన వేడ్‌.. దేశవాలీ క్రికెట్‌, బిగ్‌బాష్‌ లీగ్‌లో మాత్రం కొనసాగుతాడు. రిటైర్మెంట్‌ అనంతరం ఆండ్రీ బోరోవెక్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో అతడు జాయిన్‌ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి వేడ్‌ కొత్త బాధ్యతలు చేపడతాడు.

Also Read: IPL 2025 Retention: షాకింగ్ న్యూస్.. ఛాంపియన్ ప్లేయర్‌పై వేటు! కోల్‌కతా రిటైన్ లిస్ట్ ఇదే

నవంబర్‌ 4 నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌ పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌లో మాథ్యూ వేడ్‌ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపడతాడు. ఏదో ఓ రోజు హెడ్ కోచ్ కావాలన్నది వేడ్‌ ఆకాంక్ష. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లిస్‌ ఆడనున్నాడు. జట్టులో స్థానం కోసం సీనియర్ కీపర్ టిమ్ పైన్‌తో ఇంగ్లిస్‌ పోటీ పడుతున్నాడు. పాక్ సిరీస్‌ల అనంతరం​ ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతుంది. ‌భారత్‌తో సిరీస్ ముందు వేడ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం.