NTV Telugu Site icon

Haryana: వామ్మో.. ఎంతగా బరితెగించేశారో..!

Exam

Exam

ఇటీవలే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పేపర్ లీకేజీలకు సంబంధించి కఠినమైన చట్టాన్ని అమలు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. బోర్డు ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కానీ ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన విద్యార్థుల్లోగానీ.. తల్లిదండ్రుల్లో గానీ ఏ మాత్రం భయం కనిపించడం లేదు. తాజాగా హర్యానాలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.

హర్యానాలో ప్రస్తుతం బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పది, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే బుధవారం ఓ ఎగ్జామ్ సెంటర్‌లో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు పబ్లిక్‌గానే బరితెగించేశారు. పరీక్ష కేంద్రం దగ్గర గోడలు ఎక్కి మరీ విద్యార్థులకు బంధువులు స్లిప్‌లు అందించారు. ఈ ఘటన బుధవారం నుహ్ జిల్లాలోని తౌరులోని చంద్రావతి పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సెంటర్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతుంది.

బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు పలువురు చీటిలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాదకర స్థితిలో పాఠశాల గోడలు ఎక్కుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ లీక్ అయిందని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల బంధువులు… చీటిలు అందించినట్లు సమాచారం.

ఈ వీడియో కాస్తా విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి పరమజీత్ చాహల్ ఆదేశించారు. కొందరు పిల్లలు పాఠశాల పైకప్పుపైకి ఎక్కినట్లు తాను ఒక వీడియోలో చూసినట్లు ఆయన పేర్కొన్నారు.