NTV Telugu Site icon

Mary Kom Retirement: నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు: మేరీ కోమ్

Vmary Kom Retirement

mary Kom Retirement

Mary Kom React on Retirement News: భారత దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీ కోమ్ బుధవారం జరిగిన ఓ స్కూల్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మేరీ కోమ్ ఆట నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఆమె గురువారం స్పందించారు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌ను వీడబోనని, పోటీలో కొనసాగేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నట్లు మేరీ కోమ్ తెలిపారు.

బుధవారం అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జరిగిన ఓ స్కూల్‌ ఈవెంట్‌లో మేరీ కోమ్‌ పాల్గొన్నారు. ‘క్రీడలలో ఇంకా ఏదో సాధించాలనే కోరిక ఉంది. కానీ నా వయసు అందుకు అడ్డంకిగా మారింది. వయోపరిమితి కారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోతున్నా. నాకు ఇంకా ఆడాలని ఉన్నా.. బలవంతంగా వైదొలగాల్సి వస్తుంది. నా జీవితంలో నేను అన్నీ సాధించాను. ఇక రిటైర్‌ అవ్వాలి’ అని అన్నారు. దీంతో మేరీ కోమ్‌ బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మేరీ కోమ్‌ నేడు స్పందించారు. ‘నేను ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు సోషల్‌ మీడియా, మీడియాలో కథనాలు వచ్చాయి. అవి నిజం కాదు. నేను ఇంకా రిటైర్మెంట్‌ ఇవ్వలేదు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈవెంట్‌లో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు నేను ఇలా అన్నాను. నేను ఇంకా ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నా. రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటిస్తా’ అని మేరీ కోమ్‌ అన్నారు.

Also Read: Nara Lokesh: రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది: నారా లోకేశ్‌

2022లో కామన్వెల్త్‌ క్రీడల సెలక్షన్‌ ట్రయల్‌ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో.. మేరీ కోమ్‌ రింగ్‌లోకి దిగలేదు. బాక్సింగ్‌ రూల్స్‌ ప్రకారం.. ఎలైట్‌ లెవెల్‌లో ఆడాలంటే 40 ఏళ్లే గరిష్ఠ వయో పరిమితి. ప్రస్తుతం మేరీ వయసు 41 ఏళ్లు. కాబట్టి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. మహిళా బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో మేరీ కోమ్‌ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్‌ అయ్యారు.