NTV Telugu Site icon

Maruti Suzuki: మారుతీ లవర్స్‌కు షాక్.. మరింత పెరగనున్న కారు ధరలు

Maruti

Maruti

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. ఈ పెంపు అత్యధికంగా 4% వరకు ఉండనుందని తెలిపింది.

Read Also: Rohit Sharma: ఏంటి రోహిత్.. అంత కోపమెందుకు?

వాహన తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. అంతేకాదు అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల, అధిక దిగుమతి సుంకాలు వంటి కారకాలు కూడా దీనికి కారణమని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ ఖర్చులను పూర్తిగా భరిస్తూ వెళితే సంస్థపై ప్రభావం పడనుండడంతో వినియోగదారులపై కొంతభాగాన్ని మోపక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది.

ఈ ఏడాదిలో మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2025 జనవరిలో మారుతీ తన కార్లపై 4% వరకు ధరలను పెంచింది. ఫిబ్రవరిలో మరికొన్ని మోడళ్లపై ధరలు సవరించింది. అప్పట్లో మారుతీ కార్ల ధరలు మోడల్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.32,500 వరకు పెరిగాయి. తాజా నిర్ణయంతో ఏప్రిల్‌ 1 నుంచి మరిన్ని మోడళ్లపై ధరల పెంపు ఉండబోతోంది. అయితే, సంస్థ ఇంకా ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుందో స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

Read Also: Ranya Rao : పెళ్లైన నెలకే విడివిడిగా ఉంటున్నాం : రన్యారావు భర్త

మారుతీ సుజుకీ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నేడు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల్లో కొనసాగాయి. పెట్టుబడిదారులు కంపెనీ ధరల వ్యూహాన్ని మద్దతు ఇస్తుండడంతో, మారుతీ స్టాక్స్‌లో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. మారుతీ మాత్రమే కాకుండా, 2025 ప్రారంభం నుంచి దాదాపు అన్ని ప్రధాన ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు తమ వాహనాలపై ధరలను పెంచుతున్నాయి. మారుతీ మూడోసారి ధరలు పెంచిన నేపథ్యంలో, ఇతర కంపెనీలు కూడా త్వరలోనే ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.