Women’s T20 World Cup 2026: ‘మారిజాన్ కాప్’ దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!

Women's T20 World Cup 2026

Women's T20 World Cup 2026

Women’s T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని రుచి చూసింది. మాంచెస్టర్‌ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించింది.

టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు స్మృతి మంధాన 17 పరుగులు, షెఫాలీ వర్మ 31 పరుగులతో మంచి శుభారంభం అందించారు. ఆయినా మిడిల్ ఆర్డర్ సరిగా రాణించలేకపోయింది. యాస్తికా భాటియా 15 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత దీప్తి శర్మ 29 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచి భారత్ కు గొరవప్రదమైన స్కోర్ ను అందించింది. దీనితో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజాన్ కాప్, షబ్నిమ్ ఇస్మాయిల్ చెరో 2 వికెట్లు తీయగా.. నాన్‌కులులెకో మ్లాబా, అయబోంగా ఖాకా, నడీన్ డి క్లెర్క్ చెరో వికెట్ తీయడంతో భారత బ్యాటర్లను నియంత్రించారు.

×
×
Ad

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే కెప్టెన్ లారా వోల్వార్డ్ ను 20 పరుగులకే అవుట్ చేసారు. ఇంకా అనెరీ డెర్క్‌సెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. దీంతో దక్షిణాఫ్రికా కాస్త ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. అయితే టాజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను పూర్తిగా వారివైపు తిప్పుకున్నారు. బ్రిట్స్ 36 బంతుల్లో 40 పరుగులు చేయగా.. కాప్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 81 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. మొత్తంగా కాప్ మెరుపు ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు, షెఫాలీ వర్మ ఒక వికెట్ సాధించింది.