NTV Telugu Site icon

Manyam Bandh: నేడు, రేపు ఏపీలో బంద్‌.. మన్యంలో అన్ని మూత..

Manyam Bandh

Manyam Bandh

Manyam Bandh: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బంద్‌ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్‌ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి అన్నారు అయ్యన్న. అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది.

Read Also: Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?

ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్‌కు అఖిలపక్ష ప్రజా సంఘాలు పిలుపును ఇచ్చాయి.. ఈ బంద్‌కు ఏజెన్సీ అంతటా విశేష స్పందన లభిస్తోందని ఆదివాసీ, గిరిజన సంఘాలు చెబుతున్నాయి.. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ విజన్‌-2047లో భాగంగా టూరిజం పాలసీని ముందుకుతెచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకృతి సిద్ధమైన ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ప్రయివేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుందని మండిపడుతున్నారు.. పాలకుల విధానాల ఫలితంగా గిరిజన సలహా మండలి (టిఎసి), పీసా చట్టం వంటి గిరిజన రక్షణ కవచాలు ఒక్కొక్కటీ నిర్వీర్య దిశగా వెళ్తున్నాయని ఫైర్‌ అవుతున్నారు.. ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ రిజర్వేషన్‌ను కల్పించే జీవో 3 రద్దుతో అనేక మంది గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీకి రావడంతో ఇక్కడి గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండాపోయాయి. ఈ విషయమై ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు కొన్నాళ్లుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో స్పీకర్‌ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.. అయితే, బంద్‌ ప్రభావంతో అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి.. ఇక, నేడు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేశారు అధికారులు.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటడంతో ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు పోలీసులు.. అయితే, వాహనాల రాకపోకలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు..