Site icon NTV Telugu

Manoj Tiwary: ఎంఎస్ ధోనీకి నేను నచ్చను.. తన కాంపౌండ్‌ ఆటగాళ్లకే ఛాన్సులు!

Manoj Tiwary Vs Dhoni

Manoj Tiwary Vs Dhoni

Manoj Tiwary Said MS Dhoni doesn’t like me: టీమిండియా మాజీ క్రికెటర్‌, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఆటగాళ్లతో పోల్చితే టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంచరీ చేసినప్పటికీ అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనను జట్టు నుంచి తొలగించాడన్నారు. స్థిరమైన ప్రదర్శన చేసినా తనకు ధోనీ మద్దతు లభించలేదన్నారు. ధోనీకి తాను నచ్చనని.. తన కాంపౌండ్‌ ఆటగాళ్లకే ఛాన్సులు ఇచ్చాడని మనోజ్‌ తివారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ బెంగాల్ క్రీడా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

క్రిక్‌ట్రాకర్‌తో మనోజ్‌ తివారి మాట్లాడుతూ… ‘ప్రతి ఒక్కరూ ఎంఎస్ ధోనీని ఇష్టపడతారు. మహీ తన నాయకత్వంతో ఎంతో నిరూపించుకున్నాడు. ధోనీ నాయకత్వ లక్షణాలు చాలా బాగుంటాయని నేను ఎప్పుడూ చెబుతాను. కానీ నా విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి ఆయనే. ధోనీ నిజంగా ఇష్టపడిన, పూర్తి మద్దతు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ ఇద్దరు ఎవరో చాలా మందికి తెలుసు. కానీ అందరూ ముందుకు వచ్చి మాట్లాడరు. క్రికెట్‌లో ఇష్టాయిష్టాలు, అయిష్టతలు ఉంటాయి. బహుశా ధోనీ నన్ను ఇష్టపడలేదు’ అని చెప్పారు.

Also Read: Baby Kidnapped: ఢిల్లీలో ఆరు నెలల చిన్నారి కిడ్నాప్.. మూడు రోజుల తర్వాత..!

‘ఎంఎస్ ధోనీ, డంకన్ ఫ్లెచర్, అప్పటి సెలెక్టర్లు దీనికి సమాధానం చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నా దగ్గర సమాధానం లేదు. నేను ఎంఎస్ ధోనీని కలిసినప్పుడు సెంచరీ చేసినా నాకు అవకాశం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అడుగుతా. నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను. మహీ తన కాంపౌండ్‌ ఆటగాళ్లకే ఛాన్సులు ఇచ్చాడు. మద్దతు ఇవ్వని చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. నా విషయంలో జరిగిందో మాత్రమే చెప్పగలను. నాకు మద్దతు ఇచ్చి ఉంటే నేను కూడా మంచి ప్రదర్శన చేసుండేవాడిని’ అని మనోజ్‌ తివారి తన ఆవేదన వ్యక్తం చేశారు. ధోనీ కెప్టెన్సీలోనే తివారి అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 2008-2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 12 వన్డేలు, 3 టీ20లు ఆడారు. వన్డే ఫార్మాట్‌లో 287, టీ20 ఫార్మాట్‌లో 15 పరుగులు బాదారు.

Exit mobile version