తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తూ.. తన రాజకీయ ప్రయాణంలో టీఎంసీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని అవినీతిని, టికెట్ల అమ్మకాలను బహిర్గతం చేశారు.
టికెట్ల కోసం రూ. 5 కోట్ల డిమాండ్
హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ నిరాకరించడానికి కారణం, తాను రూ. 5 కోట్లు చెల్లించడానికి నిరాకరించడమేనని తివారీ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీ మొత్తాలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారని, అందుకే పార్టీ పరాజయం పాలైందని ఆయన విశ్లేషించారు. అవినీతిమయమైన పార్టీకి ఇలాంటి పతనం తప్పదని ఆయన విమర్శించారు.
అంతర్గత ప్రజాస్వామ్యం కరువు..
మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన తివారీ, తనకు ఆ పదవి కేవలం ఒక ‘లాలిపాప్’ లాంటిదని వ్యాఖ్యానించారు. మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలు లేవని, కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ముఖ్యమంత్రి ఇచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడబోతే ‘మాకు సమయం లేదు’ అని మమత నిరుత్సాహపరిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
అభివృద్ధి పనుల కోసం సొంత నిధులు
తన నియోజకవర్గంలోని డ్రైనేజీ, మురుగునీటి సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతో పోరాడానని, కానీ అధికారులు, స్థానిక నాయకులు సహకరించలేదని తివారీ తెలిపారు. కొన్ని పనుల కోసం తన సొంత డబ్బును కూడా ఖర్చు చేశానని, ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని ఆరోపించారు.
క్రీడల శాఖలో రాజకీయాలు..
క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్‌పై కూడా తివారీ తీవ్ర విమర్శలు చేశారు. బిస్వాస్‌కు క్రీడల పట్ల అవగాహన లేదని, తన ఎదుగుదల పట్ల ఆయన అసూయతో ఉండేవారని ఆరోపించారు. క్రీడా కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా అడ్డుకునేవారని, రాష్ట్రానికి సరైన క్రీడా విధానం లేదని విమర్శించారు. కోల్‌కత్తాలో జరిగిన మెస్సీ కార్యక్రమం అస్తవ్యస్తంగా నిర్వహించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.
భవిష్యత్తు ప్రణాళిక
రాజకీయాలకు స్వస్తి పలికి, తిరిగి క్రికెట్ వైపు అడుగులు వేయాలని తివారీ నిర్ణయించుకున్నారు. బెంగాల్ రంజీ జట్టు ప్రధాన కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసుకున్నానని, బీసీసీఐ లెవల్-2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తాను, భవిష్యత్తులో కోచ్‌గా సేవలు అందించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
