Site icon NTV Telugu

Assembly: స్పీకర్‌కు తాళం, కీ ఇచ్చిన సీఎం.. దేనికంటే..!

Key

Key

పంజాబ్‌ అసెంబ్లీలో (Punjab Assembly) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహజంగా సభలో విపక్షాలు ఆందోళన చేస్తే మార్షల్స్ చేత పంపించేస్తారు. అలాంటిది ప్రతిపక్ష సభ్యులు బయటకు వెళ్లకుండా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది.

పంజాబ్‌ అసెంబ్లీలో (Punjab Assembly) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ అంశంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలంటూ స్పీకర్‌ను సీఎం (Bhagwant Mann) కోరారు. అంతేకాకుండా తాళం, కీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. విపక్షాలు వాకౌట్‌ చేయకుండా వారిని సభలోనే ఉండేలా లోపల గడియపెట్టాలని విజ్ఞప్తి చేయడం మరింత గందరగోళానికి దారితీసింది.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం కొనసాగాయి. మార్చి 1న బడ్జెట్‌ సమావేశాలు (Budget session) ప్రారంభం అనంతరం గవర్నర్‌ చేసిన ప్రసంగానికి విపక్ష ఎమ్మెల్యేలు అడ్డుతగలారంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌లను పక్కన పెట్టిన స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వన్‌ ప్రత్యేక చర్చకు అనుమతించారు. చర్చ మొదలయ్యే కొన్ని క్షణాల ముందు స్పీకర్‌ దగ్గరకు వెళ్లిన సీఎం భగవంత్‌మాన్‌.. ఓ కవరులో తాళం, కీని అందించారు.

సభ లోపలి నుంచి తాళం వేయాలని స్పీకర్‌ను కోరారు. తద్వారా విపక్ష సభ్యులు చర్చ నుంచి తప్పించుకోకుండా చూడొచ్చని సూచించారు. విపక్ష నేత ప్రతాప్‌సింగ్‌ బజ్వా మాట్లాడుతూ.. తాము ఎక్కడికీ వెళ్లమని, సభలోనే ఉంటామన్నారు. ఈ క్రమంలోనే సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జోక్యం చేసుకున్న స్పీకర్‌.. సభలో చర్చ జరిగేలా చూసేందుకు తాళం ఓ సంకేతమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో చివరకు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త పరిణామానికి దారి తీసింది.

Exit mobile version