Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

Manipur Violence

Manipur Violence

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. గత కొంతకాలంగా కొనసాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు మరోసారి హింసాత్మక రూపం దాల్చాయి. తాజాగా జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో పలు జిల్లాల్లో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన రాకెట్ దాడులు నివాస ప్రాంతాలపై పడటంతో ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.

READ ALSO: Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!
పరిస్థితి విషమించకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించింది. హింస ప్రభావిత జిల్లాల్లో తక్షణమే అమలులోకి వచ్చేలా కర్ఫ్యూ విధించారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించి హింస మరింత పెరగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. డ్రోన్ల సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంతర్గత హింస మణిపూర్ అభివృద్ధిని, సామాన్య ప్రజల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడు జరుగుతున్న ఇటువంటి దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. తాజా ఘటనతో ఇంఫాల్ లోయలో మళ్లీ భయానక వాతావరణం నెలకొంది.

READ ALSO: Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

Exit mobile version