Manipur : మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు నాలుగు చక్రాల వాహనాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని ముష్కరులు లిలాంగ్ చింగ్జావో ప్రాంతానికి చేరుకుని స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Read Also:Gold Price Today : స్థిరంగా పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఇవి ఎవరి కార్లు అనే సమాచారం మాత్రం లభ్యం కాలేదు. తాజా హింసాకాండ తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను మళ్లీ విధించినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఒక వీడియో సందేశంలో హింసను ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు, ముఖ్యంగా లిలాంగ్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.
Read Also:Health Tips : చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
180 మందికి పైగా మృతి
మే 3, 2023 న మణిపూర్‌లో కుల హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించారు. అనేక వందల మంది గాయపడ్డారు. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా కొండ జిల్లాల్లో నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ తర్వాత హింస మొదలైంది. మణిపూర్ జనాభాలో మెయిటీ ప్రజల సంఖ్య 53 శాతం, వారు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజన నాగాలు, కుకీలు 40 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వారు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.