ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, తమ గ్రామానికి తక్షణమే కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, మండవల్లి గ్రామస్థులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఊరిలో ఉన్న ఏకైక నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని నీటి ట్యాంక్ నిర్మించి దాదాపు 45 ఏళ్లు దాటడంతో పూర్తిగా పాడైపోయిందని, పైకి ఎక్కే ఇనుప మెట్లు కూడా విరిగిపోవడంతో గడిచిన 4-5 ఏళ్లుగా ట్యాంక్‌ను శుభ్రం చేసేవారే కరువయ్యారని వాపోతున్నారు. ట్యాంక్ లోపల నాచు, బురద పేరుకుపోయి మురికి నీరు సరఫరా అవుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల 2 నుంచి 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలు రోజూ వాంతులు, విరోచనాలు, చర్మ సంబంధిత అలర్జీలు, ఒంటిపై పొక్కులతో నరకం అనుభవిస్తున్నారని తెలిపారు.
పెద్దవారు కూడా డయేరియా, కడుపునొప్పి, జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని, గ్రామంలోని ప్రతి ఇంటా ప్రతినెలా ఎవరో ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. 8 ఏళ్లుగా ఈ దయనీయ పరిస్థితి కొనసాగుతున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మండవల్లి ప్రజలు కోరుతున్నారు.

