తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మందకృష్ణ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు!
ఈ భేటీ సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మందకృష్ణ మాదిగ తీసుకెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎంతో చర్చించనున్నారు. ఇటీవలే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత సీఎంని మందకృష్ణ కలవడం ఇదే మొదటిసారి. సీఎంకి మందకృష్ణ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని, కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నివేదికపై చర్చించి సూచనలు ఇచ్చేందుకు సీఎంను తాను కలవాలనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు.