Site icon NTV Telugu

Pakistan: దైవదూషణ పేరుతో హత్య.. పోలీసుల ముందే ఘటన..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ దేశంతో దైవదూషణ కేసుల్లో హత్యలు చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయుడిని దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ కొట్టి చంపారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి, పోలీసుల ముందే ప్రజలు కొట్టి చంపారు. పోలీసులు ఉన్న ఏం చేయలేకపోయారు.

Read Also: Tejashwi Yadav: లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. తేజస్వీ కీలక ప్రకటన

తూర్పు పాకిస్తాన్ లో నన్కానా సాహిబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శనివారం ఓ గుంపు పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది. ముస్లింల పవిత్రగ్రంథమైన ఖురాన్ ను అపవిత్రం చేశారనే ఆరోపణపై 20 ఏళ్ల మహమ్మద్ వారిస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్న జనాలు వారిస్ ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టి చంపారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని తగలపెట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తేరుకుని జనాలను అడ్డుకున్నారు. ప్రజలు ఎక్కువ మంది ఉండటం, పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో అడ్డుకోలేకపోయామని పోలీసులు పేర్కొన్నారు.

2021లో శ్రీలంక జాతీయుడిని కూడా ఇలాగే చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న పాకిస్తాన్ దేశంలో దైవదూషణ తీవ్రమైన నేరం. ఇందుకు మరణ శిక్ష కూడా విధించవచ్చు. దైవదూషణ ఆరోపణలపై ఇటీవల కాలంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయని అంతర్జాతీయ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శ్రీలంక జాతీయుడి హత్య కేసులో 89 మంది అనుమానితుల్లో ఆరుగురికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. తాజా ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Exit mobile version