డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తోంది. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. డ్రగ్స్ కు అలవాటు పడి యువకులు, విద్యార్థులు తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. నిన్న మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. విద్యార్థులు గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్లను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి స్పందించారు.
Also Read:Gold Rates: పసిడి పరుగులు.. భారీగా పెరిగిన ధరలు.. నేడు తులం ఎంతంటే?
మహేంద్రా యూనివర్సిటీలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాలను గౌరవించే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామన్నారు. ఇటీవల నగరవ్యాప్తంగా జరుగుతున్న మత్తు పదార్థాలకు సంబంధించిన దర్యాప్తులో కొంతమంది విద్యార్థుల పేర్లు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, పంపిణీ చేయడాన్ని యూనివర్శిటీ ఖండిస్తోందన్నారు. మహేంద్రా యూనివర్సిటీలో చట్టాన్ని ఉల్లంఘించే లేదా విద్యార్థుల శ్రేయస్సును హానిచేసే ఏ చర్యలకైనా సున్నా సహనం (Zero Tolerance) విధానం అమలులో ఉంటుందన్నారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే, విశ్వవిద్యాలయ నిబంధనలు, చట్టప్రకారం కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం జరుగుతున్న పోలీసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నాము. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి పోలీసు శాఖకు అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. మా విద్యార్థులందరికీ సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించడం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. మా సంస్థ విలువలు, నైతికతను కాపాడేందుకు కావాల్సిన ప్రతి చర్య తీసుకుంటామన్నారు.
Also Read:Ganesh Chaturthi 2025: వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఇది మీ కోసమే..
ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందేలా సురక్షితమైన, నిబద్ధతతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించేందుకు మేము కృషి చేస్తున్నామన్నారు. ఒక ఉన్నత విద్యాసంస్థగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థులు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకుని, మహేంద్రా యూనివర్సిటీ విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
