CP Mahesh Bhagwat: “అదే నా మొదటి ప్రాధాన్యత”.. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Mahesh Bhagwat

Mahesh Bhagwat

CP Mahesh Bhagwat: తనకు హైదరాబాద్ నగరంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందని హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ గుర్తుచేశారు. 2004లో సౌత్ జోన్ డీసీపీగా, 2010లో జాయింట్ సీపీ అడ్మిన్‌గా, అలాగే జాయింట్ సీపీ స్పెషల్ బ్రాంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. అప్పట్నుంచీ నగరంలోనే వివిధ హోదాల్లో సేవలు అందించానని వివరించారు. నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోర్ అర్బన్ రీజియన్ ఏర్పడటంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధి మరింత పెరిగిందని, కొత్త జోన్లు కూడా వచ్చాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి తగినట్లుగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామన్నారు. గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నగరంలో భూముల విలువ విపరీతంగా పెరగడంతో వివాదాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయని మహేష్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ సెటిల్మెంట్లను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. బతికి ఉన్నవారికే డెత్ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే హైదరాబాద్‌ మరింత సేఫ్ సిటీగా పేరు తెచ్చుకుంటుందని, అప్పుడే నగరానికి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆకాంక్షించారు. నేరాల నియంత్రణకు కొత్త టెక్నాలజీని వాడుకుంటామని, పెండింగ్ కేసుల్లో నిందితులకు కచ్చితంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత నేరస్తులు, రిపీటెడ్ అఫెండర్లపై నిరంతరం నిఘా ఉంచి పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో పనిచేసిన పాత కమిషనర్లు తీసుకున్న మంచి చర్యలన్నింటినీ కొనసాగిస్తామన్నారు.

ప్రజలతో మమేకమవుతూ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యకలాపాలను మరింత పెంచుతామని హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్ తెలిపారు. అత్యవసర సేవల కోసం డయల్ 112, డయల్ 100 సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తామని, బేసిక్ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో అధికారులు, సిబ్బంది విధిగా రోడ్లపై ఉండేలా పెట్రోలింగ్ పెంచుతామని వెల్లడించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మహేష్ భగవత్ స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.