Mahela Jayawardene: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ ఎదురైంది. ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. రెండోసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జయవర్ధనే గత రెండు సీజన్లుగా జట్టుకు సేవలందించారు. జయవర్ధనేకు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో 2017 నుంచి 2022 వరకు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ మూడు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకుంది. అనంతరం 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు నిర్వహించారు.
ఈ పదవిలో ఉన్న సమయంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో పాటు ఐఎల్టీ20లో ఎంఐ ఎమిరేట్స్, మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్, ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీల కార్యకలాపాలను కూడా జయవర్ధనే పర్యవేక్షించారు. 2025 ఐపీఎల్‌కు ముందు మార్క్ బౌచర్ స్థానంలో జయవర్ధనే మరోసారి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండో విడతలో జట్టుకు ఆశించిన ఫలితాలు రాలేదు. 2025 సీజన్లో ముంబై నాలుగో స్థానంలో నిలిచి క్వాలిఫయర్-2లో ఓడిపోయింది. 2026 సీజన్లో పరిస్థితి మరింత దిగజారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
తన రాజీనామాపై స్పందించిన జయవర్ధనే.. ముంబై ఇండియన్స్ తన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన భాగమని పేర్కొన్నారు. ఆటగాళ్లు, కోచింగ్ బృందం, అభిమానులతో కలిసి ఎన్నో మధురమైన క్షణాలను పంచుకున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి నిరంతరం మద్దతు అందించిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటుందని అన్నారు.
మరోవైపు ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ కూడా జయవర్ధనే సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వం, నిబద్ధత, క్రికెట్‌పై ఉన్న ప్రేమ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. జయవర్ధనే ఎప్పటికీ తమ ‘వన్ ఫ్యామిలీ’లో భాగంగానే ఉంటారని అన్నారు. జయవర్ధనే తప్పుకోవడంతో ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. నవంబర్ 15న ప్లేయర్ రిటెన్షన్ గడువు ముగియనుండటంతో ఫ్రాంచైజీకి ఎక్కువ సమయం లేదు. రాబోయే నెల రోజుల్లో గోవాలో ఐపీఎల్ వేలం జరిగే అవకాశం ఉండటంతో కొత్త కోచ్ ఎంపిక ఇప్పుడు కీలకంగా మారింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పై కూడా అనేక రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 2026 ఐపీఎల్లో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపైనా విమర్శలు వచ్చాయి. ముంబై 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో హార్దిక్‌ను ట్రేడ్ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. వ్యక్తిగత ప్రదర్శనలోనూ హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 206 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ ఎంపికతో పాటు జట్టు కూర్పు, కెప్టెన్సీ విషయంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Forever a part of our MI Paltan. Thank you for everything, MJ 💙 https://t.co/BBQuZd1M3u
— Mumbai Indians (@mipaltan) October 17, 2026

