మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్ అందించనుంది. కంపెనీ ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్ ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ రెండోసారి డివిడెండ్ చెల్లిస్తోంది. గత జూన్ నెలలో ఒక్కో షేరుపై రూ. 60 డివిడెండ్ అందించిన విషయం తెలిసిందే. డివిడెండ్ నిమిత్తం సెప్టెంబర్ 21వ తేదీని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్ పొందడానికి అర్హులు. అయితే, ఎక్స్-డైరెక్ట్ లేదా రికార్డు తేదీ రోజున షేర్లు కొనుగోలు చేస్తే డివిడెండ్ వర్తించదు. డివిడెండ్ ప్రయోజనం పొందాలంటే రికార్డు తేదీకి కనీసం ఒక్క రోజు ముందే షేర్లు కొనుగోలు చేసి ఉండాలి.
మహారాష్ట్ర స్కూటర్స్ షేర్ల పనితీరు విషయానికి వస్తే.. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేర్లు సుమారు 4 శాతం లాభపడి రూ. 13,788.75 వద్ద ముగిశాయి. గత ఒక నెల కాలంలో ఈ స్టాక్ సుమారు 3.86 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, గత ఒక సంవత్సరంలో ఈ షేరు ధర దాదాపు 22 శాతం క్షీణించింది. ఇదే సమయంలో సెన్సెక్స్ సూచీ 10.50 శాతం పడిపోగా, ఈ స్టాక్ మరింత నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 18,400 వద్ద ఉండగా, కనిష్ట ధర రూ. 10,921 వద్ద ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 15,701 కోట్లుగా నమోదైంది.
స్వల్పకాలికంగా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ మంచి రాబడులనే అందించింది. గత రెండు సంవత్సరాలలో ఇన్వెస్టర్లకు దాదాపు 15 శాతం లాభం దక్కింది. అలాగే.. గత మూడు సంవత్సరాలలో ఈ స్టాక్ ధర ఏకంగా 81 శాతం మేర ఎగిసింది. ఇక ఐదేళ్ల కాలపరిమితిని పరిశీలిస్తే.. మహారాష్ట్ర స్కూటర్స్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన ప్రతిఫలాన్ని అందిస్తూ సుమారు 209 శాతం వరకు భారీ రాబడిని ఇచ్చింది.

