Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఘటన అజిత్ పవార్ అకాల మరణం. బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. అజిత్ పవార్ పార్టీని ఎవరు నడిపిస్తారు? అజిత్ వర్గం ఇప్పుడు తిరిగి శరద్ పవార్ వద్దకు వస్తుందా? ఆయన పార్టీ కోసం తెర వెనుక పావులు కదుపుతుంది ఎవరు, ఇప్పుడు ఆయన పవర్ ఎవరికి దక్కుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Sunetra Pawar: అజిత్ పవార్ మరణం.. ఎన్సీపీ కొత్త చీఫ్ “సునేత్ర పవార్” అవుతారా.?
మహారాష్ట్రలో అజిత్ పవార్‌ను అందరూ “దాదా” అని పిలుస్తారు. ఈ పిలుపు ఆయనకు స్థానికంగా ఉన్న ఇమేజ్‌కు అద్దం పడుతుంది. అజిత్ తన ఎన్సీపీ పార్టీని మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో బలోపేతం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ విడిపోయినప్పుడు, అజిత్ పవార్ చాలా మంది ఎమ్మెల్యేలను సమీకరించి, తన వర్గాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. మహాయుతి కూటమిలో ఆయన కీలక వ్యక్తిగా ఎదిగి, ఎన్‌డీఏలో బలమైన మిత్రుడిగా కొనసాగారు. బారామతి ఆయన రాజకీయలకు బలమైన కోట, అక్కడి నుంచి ఆయన అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన మరణం పార్టీ భవిష్యత్తును గందగోళంలోకి నెట్టేసింది. ఇప్పుడు పార్టీ ఎవరి చేతుల్లోకి వెళుతుందనే ప్రశ్న మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తింది.
శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, NCP పార్టీని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, NCP పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి NCP పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. అయితే శరద్ పవార్ వర్గం NCP (శరద్‌చంద్ర పవార్) లేదా NCP-SPగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి. ఇంతలోఈ విషాదం జరిగింది. పవార్ కుటుంబంలో చీలిక కూడా కుటుంబ స్థాయిలోనే జరిగింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే శరద్ వర్గంలోనే కొనసాగగా, అజిత్ భార్య సునేత్రా పవార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి సుప్రియాపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె తరువాత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ రెండు గ్రూపులు కలిసి వస్తున్నాయి. ఇటీవల జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్‌వాడ్‌లో మున్సిపల్ ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. ఇది ఈ రెండు వర్గాల ఏకీకరణకు మొదటి అడుగుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. NCP ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సులే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్: ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. అయినప్పటికీ ఆమెకు అజిత్ ఉన్నంత ప్రజా ఆకర్షణ లేదు. వారి కుమారుడు పార్థ్ చిన్నవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అతనికి రాజకీయ అనుభవం లేదు.
అలాగే కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్‌బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు అజిత్ తర్వాత పార్టీ వారసులుగా ఉద్భవించడానికి పోటీలో ఉన్నారు. కానీ వాళ్లలో ఎవరికీ కూడా అజిత్‌కి ఉన్నంత జనంలో గుర్తింపు లేదు. మొత్తం మీద అజిత్ స్థానాన్ని భర్తీ చేయగల శక్తివంతమైన నాయకుడు ఆ వర్గంలో లేరు. ఇది ఆ వర్గాన్ని బలహీనపరచవచ్చు, లేదంటే ఆ వర్గాన్ని బీజేపీ హైజాక్ చేయగలదని కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ వద్దకు తిరిగి రావచ్చనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. శరద్ అనుభవజ్ఞులు, సుప్రియా సూలే జాతీయ స్థాయి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అజిత్ వర్గం అధినేత లేకుండా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్న కారణంగా, రెండు వర్గాలు ఏకీకరణ జరిగితే శరద్ వర్గాన్ని బలోపేతం చేస్తుంది. అయితే అజిత్ పవార్ పార్టీ నాయకులు ఏం కోరుకుంటున్నారనే దానిపై ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అజిత్ వర్గం శరద్ పవార్‌తో తిరిగి కలవకపోతే NCP పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Ajit Pawar: మహారాష్ట్రలో ముగిసిన ‘పవార్’ పాలిటిక్స్.. కింగ్ మేకర్ కలలు కల్లలయ్యాయి!
