16 ఏళ్లుగా విడిగా ఉన్న దంపతులకు మద్రాస్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలేం జరిగింది. విడాకుల సందర్భంగా ధర్మాసనం అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
16 ఏళ్లుగా విడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో కోర్టు చేసిన “రాడికల్ ఫెమినిస్టులు” వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీరును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించగా.. దాంపత్య బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొంటూ డివిజన్ బెంచ్ వివాహాన్ని రద్దు చేసింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఎండీ సుమతి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆగస్టు 19న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ఆగస్టు 31న బహిరంగంగా అందుబాటులోకి వచ్చింది.
భర్త ఉద్యోగం కోసం ముంబై వెళ్లి భార్యను అక్కడికి తీసుకెళ్లకపోవడం దాంపత్య బాధ్యతలో వైఫల్యమేనని కుటుంబ న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. “ట్రయల్ కోర్టు తీసుకున్న ఈ విప్లవాత్మక విధానాన్ని రాడికల్ ఫెమినిస్టులు ప్రశంసించవచ్చు. కానీ మేం దానిని ఆమోదించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు కొన్ని పరిస్థితుల్లో కలిసి జీవించడం సాధ్యం కాకపోవచ్చని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
అలా సాధ్యం కాదు
సైనికుడి ఉద్యోగాన్ని ఉదాహరణగా తీసుకున్న హైకోర్టు.. భర్త ఉద్యోగం కారణంగా భార్యను ప్రతిసారీ తనతో పాటు తీసుకెళ్లడం సాధ్యం కాదని పేర్కొంది. “భర్త సైనికుడైతే.. ఆర్మీ బ్యారక్స్‌లో కుటుంబ జీవితం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. భార్యకు కూడా ఉద్యోగం ఉండొచ్చు. ఆమె భర్త వెంట తప్పనిసరిగా వెళ్లాలని ఆశించలేం” అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రముఖ వోడాఫోన్ ప్రకటనలోని పగ్ కుక్కను ప్రస్తావించింది. భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి భార్య కూడా తప్పనిసరిగా అతడిని అనుసరించాలనే భావన సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది.
1992లో వివాహం.. 16 ఏళ్లుగా వేర్వేరుగా
ఈ కేసులోని దంపతులకు 1992 సెప్టెంబర్ 10న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ఉన్నారు. ఉద్యోగం కోసం ముంబై వెళ్లారు. భార్య మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయారు. కాలక్రమేణా ఇద్దరూ 16 ఏళ్ల పాటు విడిగా జీవించారు. 2014లో భర్త వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆరోపించాడు. అయితే కుటుంబ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
వెంట తీసుకెళ్లాల్సింది
భర్త ఉద్యోగం కోసం మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు భార్య కూడా వెంట తీసుకెళ్లాల్సిందేనని.. తీసుకెళ్లకుండా వివాహేతర సంబంధాన్ని చాకుగా చూపించి విడాకులు కోరడం తన తప్పు నుంచి ప్రయోజనం పొందడమే అవుతుందని కుటుంబ న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్టపరంగా భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని, అందువల్ల తాను ఎక్కడికి వెళ్లినా భార్యను తనతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ట్రయల్ కోర్టు అభిప్రాయపడింది. భార్యను తనతో తీసుకెళ్లకపోవడం వల్ల వివాహేతర సంబంధాలకు లేదా వాటిపై పుకార్లకు అవకాశం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది.
భర్త హైకోర్టుకు..
కుటుంబ న్యాయస్థానం పిటిషన్ తిరస్కరించడంతో భర్త హైకోర్టును ఆశ్రయించాడు. భార్య కూడా దాంపత్య బంధాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన తీవ్రమైన తప్పిదాన్ని ఆధారంగా చేసుకుని విడాకులు పొందలేడనే నిబంధనను గుర్తించింది. అయితే ఉద్యోగం కోసం భర్త ముంబై వెళ్లడం మాత్రమే దాంపత్య బాధ్యతల ఉల్లంఘనగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో 16 ఏళ్ల సుదీర్ఘ విభజన కాలంలో భార్య కూడా దాంపత్య బంధాన్ని పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కనీసం ఒక అధికారిక లేఖ లేదా నోటీసు కూడా ఆమె పంపలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు హైకోర్టు ప్రయత్నించింది. ఇద్దరినీ కలిపేందుకు, పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించేందుకు అవకాశం కల్పించినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైంది. “ఆరోపణలు, ప్రత్యారోపణల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. వారు తిరిగి కలిసే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు” అని ధర్మాసనం పేర్కొంది. దీంతో దాంపత్య బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని నిర్ధారించిన కోర్టు.. వివాహాన్ని రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భర్త తన భార్యకు రూ.7 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాతే విడాకుల డిక్రీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
హైకోర్టు వ్యాఖ్యలపై విమర్శలు
ఈ తీర్పుతో వివాహ వివాదానికి ముగింపు లభించినప్పటికీ.. కోర్టు ఉపయోగించిన భాష, ముఖ్యంగా వోడాఫోన్ ప్రకటనలోని పగ్ కుక్కతో భార్యను పోల్చడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయవాది చారు మాథుర్.. హైకోర్టు ఇచ్చిన న్యాయపరమైన నిర్ణయాన్ని సమర్థించవచ్చని, కానీ ఉపయోగించిన ఉదాహరణతో ఏకీభవించాల్సిన అవసరం లేదని అన్నారు. భార్యను తన భర్తను అనుసరించే పగ్ కుక్కతో పోల్చడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. వివాహంలో భార్యాభర్తలు సమాన భాగస్వాములని, భార్యకు స్వతంత్ర నిర్ణయాధికారం, స్వేచ్ఛ ఉంటాయని చెప్పారు. న్యాయస్థానాలు ఉపయోగించే భాషకు విస్తృత ప్రభావం ఉంటుందని.. ఇలాంటి రూపకాలు లింగపరమైన మూస ధోరణులను మరింత బలపరిచే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

