Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?

Madhya Pradesh1

Madhya Pradesh1

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు లభించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఖర్గోన్ జిల్లా పరిధిలోని మండ్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఓటర్ కార్డులు కుప్పలుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వీటిలో అత్యధిక కార్డులు ఇండోర్‌లోని ‘రౌ’ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా తెలుస్తోంది. నది వద్ద ఓటర్ కార్డులు అలా చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం ఉదయం నిస్వార్థ్ సేవా సమితి సభ్యులు మండ్లేశ్వర్ వద్ద నర్మదా ఘాట్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో ఈ ఓటర్ కార్డులను గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో మహేశ్వర్ ఎస్‌డిఎమ్ పూర్వా మండ్లోయ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ బృందం అక్కడికి చేరుకుని కార్డులను రికవరీ చేసి అధికారికంగా పంచనామా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న కార్డుల సంఖ్య, అవి ఎవరివనే వివరాలను సేకరిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డిఎమ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లు మండ్లేశ్వర్ పోలీస్ అధికారి శ్వేతా శుక్లా తెలిపారు.

మరోవైపు ఈ ఘటన స్థానికంగా పెద్ద రాజకీయ దుమారమే రేపింది. నర్మదా తీరంలో భారీ సంఖ్యలో ఓటర్ కార్డులు పడి ఉండటం వెనుక ఓట్ల దొంగతనం, ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు మండ్లేశ్వర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఖర్గోన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రవి నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్‌డిఓపికి ఫిర్యాదు చేస్తూ, తాము సేకరించిన మరికొన్ని ఓటర్ కార్డులను అధికారులకు అందజేసి తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇండోర్ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్ల కార్డులు ఖర్గోన్ జిల్లాలోని నది ఒడ్డుకు ఎలా వచ్చాయో నిష్పాక్షికంగా విచారించాలని కాంగ్రెస్ కోరింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిరూపణ కానప్పటికీ, అసలు ఈ ఓటర్ ఐడీ కార్డులను ఎవరు తెచ్చారు, నది ఒడ్డున ఎందుకు పడేశారు, వాటి సంఖ్య ఎంత అనే విషయాలపై యంత్రాంగం లోతుగా విచారణ జరుపుతోంది.