Site icon NTV Telugu

Madagascar Government Dissolved: మడగాస్కర్‌లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది?

Andry Rajoelina

Andry Rajoelina

Madagascar Government Dissolved: యువత తలుచుకుంటే దేశంలో అధికారులు చేతులు మారుతాయని నేపాల్ వంటి దేశంలో జరిగిన నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి. నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు పెల్లుబిక్కాయి. తాజాగా మడగాస్కర్‌లో జనరల్ జెడ్ ఉద్యమం వేరే రూపాన్ని సంతరించుకుంది. జనరల్ జెడ్ ఉద్యమం దెబ్బకు మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశంలో చెలరేగుతున్న అశాంతిని అంతం చేయడానికి తన ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన వ్యూహం అక్కడ పని చేయలేదు. ఇప్పుడు దేశంలో యువత తిరుగుబాటులోకి సైన్యం కూడా ప్రవేశించింది.

READ ALSO: Tollywood : ఇదేం జర్నలిజం? ఇలాంటి ప్రశ్నలు అవసరమా?

దేశంలో కొత్త సైనిక అధిపతి నియామకం..
సెప్టెంబర్ 25న మడగాస్కర్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. రెండు వారాలకుపైగా జరుగుతున్న ఈ నిరసనలో అనేక మంది ప్రజలు మరణించారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల పక్షాన నిలిచిన మడగాస్కర్ సైన్యంలోని ఒక విభాగం మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఆదివారం అది కొత్త సైనిక అధిపతిని కూడా నియమించింది. అయితే ఈ నియామకాన్ని అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా అధికారాన్ని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా ఖండించారు.

తాజా నిరసనలో మరణించిన వారిని స్మరించుకోవడానికి రాజధానిలో నిరసనకారుల ఆధ్వర్యంలో ఒక ర్యాలీ జరిగింది. ఈ నిరసన ర్యాలీలో ఆర్మీ యూనిట్ అయిన CAPSAT.. నిరసనకారులతో చేరారు. వాస్తవానికి ప్రస్తుత దేశాధ్యక్షుడు రాజోలీనాను మొదటిసారి అధికారంలోకి తెచ్చిన 2009 తిరుగుబాటులో ఈ CAPSAT యూనిట్ కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజోలీనా అధ్యక్షుడిలిగా మారడానికి సహాయం చేసిన అదే తిరుగుబాటు బృందం ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటుకు మద్దతు ఇస్తుంది. తాజాగా ప్రభుత్వం నిరసనకారులపై కాల్పులు జరపాలని ఇచ్చిన ఆదేశాలను తిరస్కరిస్తామని ఈ బృందం శనివారం ప్రకటించింది.

మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకున్న CAPSAT ..
పలు నివేదికల ప్రకారం.. ఈ యూనిట్ల నుంచి సైనికులు నగర కేంద్రంలోకి ప్రవేశించి అనేక వేల మంది నిరసనకారులను కలిసిన సందర్భంలో వారిని జనసమూహం ఉత్సాహపరిచింది. ఆదివారం తెల్లవారుజామున.. CAPSAT ఒక వీడియో ప్రకటనలో “ఇక నుంచి మలగాసీ సైన్యానికి సంబంధించిన అన్ని ఆర్డర్లు – భూమి, వైమానిక లేదా నావికాదళం అయినా – CAPSAT ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయబడతాయి” అని పేర్కొంది. ఈ బృందం మొత్తం సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈ ప్రకటన స్పష్టం చేసింది. ఈ వీడియో బయటికి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సాయుధ దళాల మంత్రి మనంట్సోవా డెరామసింజకా రకోటోరివెలో హాజరైన కార్యక్రమంలో జనరల్ డెమోస్తేనిస్ పికులస్ కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు.

అధ్యక్షుడు రాజోలీనా ఆదివారం ఒక ప్రకటనలో.. దేశంలో “రాజ్యాంగం, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం జరుగుతోంది” అని అన్నారు. “దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంభాషణ మాత్రమే ఏకైక మార్గం, పరిష్కారం” అని ఆయన జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే సమయంలో CAPSAT యూనిట్‌కు చెందిన కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా మీడియాతో మాట్లాడుతూ.. నిరసనకారులతో చేరాలని తన యూనిట్ తీసుకున్న నిర్ణయం తిరుగుబాటుకు సమానం కాదని చెప్పారు. “మేము ప్రజల పిలుపుకు ప్రతిస్పందించాము, కానీ అది తిరుగుబాటు కాదు” అని ఆయన విలేకరులతో చెప్పారు.

READ ALSO: Pakistan Security Crisis: ముక్కోణపు గర్జనలో చిక్కుకున్న దాయాది.. పాక్‌కు దిక్కేది?

Exit mobile version