NTV Telugu Site icon

LSG vs CSK: జడేజా, ధోనీ మెరుపులు వృథా.. కీలక పోరులో లక్నో సూపర్ విక్టరీ..

Lsg

Lsg

IPL 2024: వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నిర్దేశించిన 177 రన్స్ టార్గె్ట్ ను మరో ఓవర్‌ మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్జీవమైన లక్నో పిచ్‌పై డికాక్‌ (43 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్ రాహుల్‌ (53 బంతుల్లో 82, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు భాగస్వామ్యంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత సీఎస్‌కేను లక్నో బౌలర్లు కట్టడి చేయడంతో ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్‌, 5 ఫోర్లు, 1 సిక్సర్‌), రహానే (36) రాణించారు.

Read Also: Saturday Stotram: మీ సంకల్పం నెరవేరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి

ఇక, ఆరంభ మ్యాచ్‌లలో అదరగొట్టిన రచిన్‌ రవీంద్ర (0) మరోసారి నిరాశపరచగా కెప్టెన్‌ రుతురాజ్‌ (17) కూడా ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన జడేజా.. ఓపెనర్‌ రహానే (36) తో కలిసి పరుగులు రాబట్టారు. ఈ జోడీని కృనాల్‌ పాండ్యా విడదీశాడు. ఆ తర్వాత ఈ సీజన్‌లో జోరు మీదున్న శివమ్ దూబే (3)ను స్టోయినిస్‌ పెవిలియన్‌కు పంపించేశాడు. రహానే స్థానంలో వచ్చిన రిజ్వి (1) ఏమాత్రం ప్రభావం చూపకుండానే డగౌట్ కు వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడ్డూ.. మొయిన్‌ అలీ (30) సీఎస్‌కే రన్ రేట్ ను మళ్లీ పెంచారు. 18వ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లు కొట్టిన మొయిన్ అలీ.. ఆ మరుసటి బంతికే బదోని చేతికి చిక్కాడు. ఇక, 13 బంతులు మిగిలుండగా క్రీజులోకి వచ్చిన ధోనీ.. 4, 6, 6, 4, 4 తో మొత్తం 28 పరుగులు చేసి చెన్నైకి పోరాడే స్కోరును అందించాడు.

Read Also: Govinda Namalu: మనసులోని కోరికలు నెరవేరాలంటే.. గోవిందనామాలు వినండి

టార్గెట్ ను ఛేదించేందుకు వచ్చిన లక్నోకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్‌ ప్లేలో ఈ జోడీ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముస్తాఫిజుర్‌ వేసిన 15వ ఓవర్లో క్వింటన్ డికాక్‌ ధోనీకి క్యాచ్‌ ఇవ్వడంతో 134 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. ఈ పిచ్‌పై ఈ వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రాహుల్‌, డికాక్‌ ఔట్‌ అయినా తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్‌ (23 నాటౌట్‌), స్టోయినిస్‌ (8 నాటౌట్‌) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసేశారు.