Yash Thakur takes first Five-Wicket Haul in IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల హవా కొనసాగుతోంది. యువ బౌలర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ బౌలింగ్‌తో హడలెత్తిస్తున్నారు. మయాంక్ అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించగా.. తాజాగా యశ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేసిన బౌలర్‌గా యశ్ రికార్డుల్లోకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ 2024లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్‌గానూ నిలిచాడు.
ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో గెలిచింది. లక్నో విజయంలో యశ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించాడు. 3.5 ఓవర్లలో 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. అద్భుత ప్రదర్శన చేసిన యశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘5 వికెట్స్ పడగొట్టడం ఆనందంగా ఉంది. శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాను. మా వ్యూహాన్ని అమలు చేయమని కెప్టెన్ కేఎల్ రాహుల్ సూచించాడు. అది విజయవంతమైంది. దురదృష్టవశాత్తూ మయాంక్ యాదవ్ గాయపడ్డాడు. ఐపీఎల్‌లో తొలిసారి గుజరాత్‌పై విజయం సాధించాం. అయితే గిల్‌ను ఔట్ చేయడమే నాకు గుర్తుండిపోతుంది’ అని యశ్ అన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా యశ్ ఠాకూర్ నిలిచాడు. ఉమ్రాన్ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్ (5/30) ఈ ఘనత సాధించారు. లక్నో తరఫున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్‌గా యశ్ రికార్డుల్లోకి ఎక్కాడు. గుజరాత్‌పై 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీపై మార్క్‌వుడ్ 14 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. యశ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.