Low Hemoglobin: శరీరంలో తరచూ అలసట, బలహీనత, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న గాయానికే ఎక్కువ రక్తస్రావం వంటి సమస్యలు కనిపిస్తే.. వాటి వెనుక హిమోగ్లోబిన్ లేదా ప్లేట్‌లెట్స్ తగ్గుదల కారణంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్స్ స్థాయిలు తగ్గిపోతే శరీరానికి సరైన ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో పాటు రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా దెబ్బతింటుంది.
ఆయుర్వేదం ప్రకారం హిమోగ్లోబిన్ తగ్గడాన్ని ‘పాండు రోగం’ అని అంటారు. ఇది పిత్త దోషం అసమతుల్యత వల్ల వస్తుందని నిపుణులు చెబుతారు. అలాగే ప్లేట్‌లెట్స్ తగ్గుదల రక్తపిత్త సమస్యలకు సంకేతంగా భావిస్తారు. జీర్ణక్రియ బలహీనపడటం, శరీరంలో విషపదార్థాలు పెరగడం, ఒత్తిడి, అధిక మసాలా, ఉప్పు, పులుపు ఆహారాలు తీసుకోవడం వంటి కారణాలు ఈ సమస్యలకు దారితీస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
హిమోగ్లోబిన్ తగ్గితే అలసట, తల తిరగడం, చర్మం పసుపు లేదా తెల్లగా మారడం, చేతులు-కాళ్లు చల్లబడటం, తలనొప్పి, గుండె సంబంధిత ఇబ్బందులు కనిపించవచ్చు. ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు తరచూ గాయాలు అవడం, ఎక్కువసేపు రక్తస్రావం ఆగకపోవడం, మూత్రం లేదా మలంలో రక్తం కనిపించడం, మహిళల్లో అధిక రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేదంలో కొన్ని సహజ పద్ధతులు సూచించబడ్డాయి. నిపుణుల సూచనల ప్రకారం దానిమ్మ, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం మంచిదట. వీటిలో ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్ కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్స్ పెరగడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కఫ స్వభావం ఉన్నవారు అల్లం, తులసి కూడా కలిపి తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
వీట్ గ్రాస్‌లో ఉండే క్లోరోఫిల్ నిర్మాణం హిమోగ్లోబిన్‌కు సమానంగా ఉండటంతో ఇది రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుందని చెబుతారు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహకరిస్తాయి. అలాగే గిలోయ్ అనే ఔషధ మొక్క రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ప్లేట్‌లెట్స్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుందని ఆయుర్వేదంలో ప్రాధాన్యత ఉంది.
అలోవెరాలో ఉండే విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాలు రక్త నిర్మాణానికి దోహదపడతాయి. అదే విధంగా ఉసిరి, అశ్వగంధ, శతావరి వంటి మూలికలు కూడా రక్త నాణ్యతను పెంచడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో బీట్‌రూట్, ఆకుకూరలు, నువ్వులు, నెయ్యి వంటి పదార్థాలను చేర్చడం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్ లభించి హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ముఖ్యంగా నల్ల నువ్వులను రాత్రంతా నానబెట్టి తీసుకుంటే ప్లేట్‌లెట్స్, హిమోగ్లోబిన్ పెరగడంలో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సూచనలు సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే. హిమోగ్లోబిన్ లేదా ప్లేట్‌లెట్స్ తీవ్రంగా తగ్గినట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.
