NTV Telugu Site icon

Cybercrime: అధిక ఆదాయం పేరుతో లూటీ.. రూ.17 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

మోసపోయేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలని ఎంతచెప్పినా.. కొందరు చెవికెక్కించుకోవడం లేదు. సులువుగా మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. సైబర్‌ నేరాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే విద్యావంతులు కూడా ఎక్కువగా మోసగాళ్ల మాటలు నమ్మి.. లక్షల రూపాయలను కోల్పోతున్నారు. ఆన్‌ లైన్ ఉద్యోగం, పార్ట్‌ టైం ఉద్యోగాలు, ఆన్‌ లైన్‌ టాస్క్‌లు ( Online task Scam ) పేరిట జరుగుతున్న మోసాల్లో బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జరిగింది. ఓ డాక్టర్‌ ఏకంగా రూ.17 లక్షలు కోల్పోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేవీ ముంబయిలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల డాక్టర్‌కు మే నెలలో మరో మహిళ నుంచి టెలిగ్రామ్‌ మెసేజ్‌ వచ్చింది. తనను కల్యాణిగా పరిచయం చేసుకుంది. అనంతరం తమ వద్ద మంచి ఉద్యోగ అవకాశం ఉందని, రోజులో కొన్ని గంటలు పనిచేస్తే.. అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపింది.

Read more: Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్‌ని కలిసిన అతిషి, రాఘవ్ చద్దా.. ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..

తన సంస్థ కోసం రివ్యూలు చేయాలని, అందుకు కమిషన్ వస్తుందని సదరు మహిళ.. డాక్టర్‌కు తెలిపింది. ఇదంతా నిజమని నమ్మిన డాక్టర్‌.. తొలుత రూ.11,000 చెల్లించింది. అనంతరం వారు చెప్పిన యాప్‌లో లాగిన్‌ అయ్యి.. పని పూర్తి చేసింది. అందుకు ఆమెకు రూ.983 కమీషన్ రూపంలో వచ్చింది. ఆ నగదును ఆమె విత్‌డ్రా చేసుకున్నారు. అనంతరం మరో రూ.11000 చెల్లించి, యాప్‌లో లాగిన్‌ కావాలని మరియు ఉత్పత్తులను రివ్యూ చేయాలని డాక్టర్‌కు సూచించారు. తర్వాత ముంబయికి చెందిన డాక్టర్‌ను టెలిగ్రామ్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేశారు. అందులో ఉన్న మిగిలిన సభ్యులు తమకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తోందని, మరింత ఎక్కువ పనిచేసి అదనపు ఆదాయం పొందాలంటూ సూచించారు. అలా ముంబయికి చెందిన డాక్టర్‌ ఏకంగా రూ.17.27 లక్షలు చెల్లించారు. అయితే ఆమె ఖాతాలో రూ.37.48 లక్షలు ఉన్నట్లు చూపించారు. అయితే ఒకరోజు ఆ నగదును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నం చేయగా.. 30 శాతం కమీషన్‌ చెల్లించాలని డాక్టర్‌కు.. నేరగాళ్లు సూచించారు. దీంతో తాను మోసపోయినట్లు డాక్టర్‌ గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నేరగాళ్లపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.