Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్‌ న్యూస్‌.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు

Lokesh

Lokesh

Nara Lokesh: పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్న మంత్రి లోకేష్, ఇప్పటికే సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. ఇది ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఈ విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషే ప్రధాన కారణమని లోకేష్ కొనియాడారు. విద్యార్థులు సాధించే మంచి ఫలితాలే ప్రభుత్వానికి నిజమైన ప్రచారమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపించడం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో ఒక విశేషమైన ఘట్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని తెలిపారు మంత్రి నారా లోకేష్‌..