Polling Started for MP Elections in 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఈసారి మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.32 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
