Lift Breakdown: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో జరిగిన ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో, లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ఘటన సమయంలో లిఫ్టులో 13 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాల యాజమాన్యం.
Read Also: Hyderabad: క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జ్.. కేంద్ర మంత్రి ఆగ్రహం
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్షతగాత్రుల వివరాలు, అలాగే ఈ ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లిఫ్ట్ రక్షణ చర్యలపై, నిర్వహణలో ఉన్న లోపాలపై కూడా విచారణ జరుపుతున్నారు. ఇకపోతే, ఇలాంటి లిఫ్ట్ ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం ఘటన మరోసారి లిఫ్ట్ భద్రతపై ఉన్న అప్రమత్తతను తెలియజేస్తోంది. ప్రజలు, లిఫ్ట్ నిర్వహణ సంస్థలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.