Leopard at SV University: తిరుపతి, తిరుమలను ఇప్పట్లో చిరుత భయం వదిలేదా లేదు.. తిరుమలలో చిన్నారిపై దాడి చేసిన చిరుత.. ఈ రోజు బోనులో పడింది. స్వల్పంగా గాయపడటంతో.. చికిత్స అందించారు. మెట్ల మార్గంలో.. కాలినడక భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడకన వెళ్లే భక్తుల కోసం.. సెక్యూరిటీని నియమించింది. మరోవైపు శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.. ఇక్కడితో అయిపోలేదు.. ఇప్పుడు తిరుపతి ఎస్వీ యునివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు విద్యార్థులు. ఇక, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు యూనివర్సిటీ సెక్యూరిటీ. ఓవైపు తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఇప్పుడు ఎస్వీ యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది.
Read Also: PM Modi: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
కాగా, తిరుమలలో ఆరేళ్ల బాలికపై దాడి చేసిన చిరుత చిక్కింది. ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని.. ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. బోనులో పట్టుబడ్డ చిరుతను తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడిందని.. ఎస్వీ జూ పార్కులో చికిత్స అందిస్తామన్నారు. చికిత్స అనంతరం ఈ చిరుత మ్యాన్ ఈటర్ అవునా? కాదా? అనే అంశంపై పరీక్షిస్తామని వివరించారు. భక్తుల రక్షణకు అవసరమైన ఫారెస్ట్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. భక్తులను గుంపులు గుంపులుగా పంపాలని…మార్గంమధ్యలో జంతువులకు భక్తులు ఆహారం పెట్టడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడమార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలతో ఉన్న తల్లిదండ్రులను అనుమతించనుంది టీటీడీ. కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికీ ఊత కర్రను ఇవ్వాలని నిర్ణయించినట్లు భూమన తెలిపారు. అలిపిరి నుంచి ఘాట్‌రోడ్డులో వెళ్లే టూవీలర్స్‌ని ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు.
Read Also: Minister Vidadala Rajini: రాజధానిగా సమర్ధించని వాళ్లు ఏ ముఖం పెట్టుకుని విశాఖ వచ్చారు..
ఇక, తిరుమలలోని శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఉదయం 2వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రావడాన్ని గుర్తించిన భక్తులు.. భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి నడకమార్గంలో వస్తున్న భక్తులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎస్వీయూలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.