NTV Telugu Site icon

Shanti Bhushan: కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

Shanti Bhushan

Shanti Bhushan

Shanti Bhushan: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్‌ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో శాంతి భూషణ్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 97సంవత్సరాలు. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 1925, నవంబర్ 11న ఆయన జన్మించారు. శాంతి భూషణ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1974లో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదిగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

Read Also:CS Shanti Kumari : కొత్త సచివాలయంలో భద్రతపై సీఎల్‌ శాంతి కుమారి సమీక్ష

1977 నుంచి 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో 1977-1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 1980లో ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా సుప్రీంకోర్టులో ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2018లో కూడా ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్‌‌’పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ తరఫున ఒక కేసు వాదించారు. ఈ కేసు 1974లో ఇందిరా గాంధీ ప్రధానిగా తొలగింపునకు కారణమైంది. 44వ రాజ్యాంగ సవరణలోనూ ఆయన ముఖ్య పాత్ర పోషించారు. 1980లో బీజేపీలో చేరారు. అయితే, 1986లో తన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరించినందుకుగాను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాది.

Show comments