NTV Telugu Site icon

Last Rites For Cow: గోమాతకు అంతిమ వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు

Cow Last

Cow Last

మన సంప్రదాయంలో అంత్యక్రియలకు ఎంతో పవిత్రత ఉంది. అనారోగ్యం, ఇతర కారణాల వల్ల అయినవారు కాలం చేస్తే వారిని సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుస్తాం. అంత్యక్రియలు వైభవంగా నిర్వహిస్తాం. అశువులు బాసిన అందాల రాణి గోమాతకు కడసారి వీడ్కోలు పలికారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించిన గోమాతను సాగనంపారు. గుమ్మిలేరులో గోమాతకు దశదినకర్మలు నిర్వహించారు. బంధుమిత్రులకు దిన భోజనాలు ఏర్పాటుచేశారు.

Read Also: Kiran Abbavaram: అన్నమాచార్య వారసులను సన్మానించిన ‘వినరో భాగ్యము…’ చిత్ర బృందం

గోవును దేవతగా పూజించే సంస్కృతి మనది. కొందరు రైతులు ఆవులు మృతి చెందితే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపడమే గాక దశదినకర్మలను చేపడుతుంటారు. ఇందులో భాగంగానే ఆవుల అందాల పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించి ఇటీవల ఆశువులు బాసిన గోమాతకు దశ దశదిన కర్మను నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో ఒకరైతు ఇంట్లో 21 సంవత్సరాల పాటు పెరిగిన ఆవు మృతి చెందటంతో దానికి అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా దశదిన కర్మను సైతం జరిపించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన రైతు రెడ్డి సత్తిబాబుకు అరుదైన పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పశువుల అందాల పోటీలు జరిగినా ఆ పుంగనూరు ఆవుదే మొదటి బహుమతి. పాల పోటీల్లో కూడా తనదే పైచేయిగా ఉండేది. 21 సంవత్సరాల వయసున్న ఈ పుంగనూరు14 సంవత్సరాల పాటుగా వందలాది ఆవుల సంతతికి దోహదపడింది. అటువంటి అరుదైన ఆవు తెలుగు రాష్ట్రాలలో జరిగిన పశువుల అందాల పోటీలు,పాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించి రైతుకు ఎంతో గుర్తింపు తెచ్చింది.

అటువంటి అరుదైన అవు ఈనెల మూడున మృతి చెందింది. అప్పుడు శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించారు. అలాగే తన మకాం వద్ద ఆవు చిత్ర పటంతో పూజలు నిర్వహించి అనంతరం వందలాది మంది బంధుమిత్రులు, రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సత్తిబాబు మాట్లాడుతూ మాకూ, మాగ్రామానికి ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఈ గోవు మృతి చెందడంతో తామంతా తీవ్ర విషాదంలోకి వెళ్లామన్నారు. తమ కుటుంబ సభ్యులు మృతిచెందినట్లుగానే భావించి ఈ దశదినకర్మలు చేపట్టినట్లు రైతు రెడ్డి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు వివరించారు.

Read Also: Bandla Ganesh: బండ్ల గుండు బాస్ లుక్.. కళ్లన్నీ ఆ కళ్లజోడు మీదే

Show comments