Karthika Masam : చివరి కార్తీక సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు ఉదయాన్నే నదీ స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నారు. ఏపీలోని త్రిపురాంతకం, భైరవకోన, సోపిరాల, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, పొదిలి శ్రీ నిర్మామహేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి.. అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అటు ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో పవిత్ర కళ్యాణ మండపం లో కార్తీక సోమవారం సందర్భంగా ఇష్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచారామ క్షేత్రాలు సామర్లకోట చాళుక్య కుమార రామ భీమేశ్వరాలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి దర్శనానికి అనుమతినిచ్చారు ఆలయ సిబ్బంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Read Also: Convicts Escape : అచ్చం సినిమాల్లో లాగే పక్కా ప్లాన్ వేశారు.. ఎస్కేప్ అయ్యారు
పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భక్తులతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిసిపోయాయి. కోటిలింగాల ఘాట్ లో ఇవాళ సాయంత్రం కార్తీక లక్షదీపోత్సవం నిర్వహణ ఉంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి లోని ఉమాకోటిలింగేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలం దేవాలయంలో మల్లన్న దర్శనానికి వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో రద్దీ దృష్ట్యా అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు.
తెలంగాణలో ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా యాదగిరి గుట్ట, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిన్న కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో పిక్నిక్ స్పాట్స్ కు ప్రజలు పోటెత్తారు. బీచ్లు, ఆలయాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ చూసిన జనసందోహమే కనిపించింది.
