Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..

Lal Bahadur Shastri

Lal Bahadur Shastri

Lal Bahadur Shastri Jayanti: భారతదేశ తొలి తరం నాయకుల్లో మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జీవితం, ప్రయాణం చూస్తే ఎంతటి వారికైనా స్ఫూర్తి కలగక మానదు. ఈరోజు ఆయన జయంతి. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతితో పాటే శాస్త్రి జయంతి కావడం ఒక విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శాస్త్రి జీవితంలోని కొన్ని విషయాలను నేడు మనం తెలుసుకుందాం..

లాల్ బహదూర్ శాస్త్రి 1904, అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు దేశభక్తి మెండు. గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై, కేవలం 16 ఏళ్ల వయసులోనే చదువును పక్కనబెట్టి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. ఆ తర్వాత వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో చదువు పూర్తి చేసి, ‘శాస్త్రి’ (పండితుడు) అనే బిరుదును పొందారు. ఆ పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఎన్నో ఏళ్లు బ్రిటిష్ జైళ్లలో గడిపిన మహనీయుడాయన. స్వాతంత్ర్యం వచ్చాక ముందుగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలో చురుగ్గా పనిచేసిన శాస్త్రి, ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే, రవాణా, వాణిజ్య-పరిశ్రమలు, హోంశాఖ వంటి అనేక కీలక పోర్ట్‌ఫోలియోలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయన ఎంత నిజాయితీపరుడో చాటిచెప్పే ఒక సంఘటన జరిగింది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఒక భారీ రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రమాదానికి శాస్త్రికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ప్రధాని నెహ్రూ స్పష్టం చేసినప్పటికీ, ఆయన రాజీనామాను ఆమోదించక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో పదవుల కంటే జవాబుదారీతనం ఎంత ముఖ్యమో చాటిచెప్పిన ఆ ఘటన, ఆయన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

1964లో నెహ్రూ హఠాన్మరణం తర్వాత, జూన్ నెలలో లాల్ బహదూర్ శాస్త్రి భారత రెండో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే దేశం తీవ్ర ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది, సరిహద్దుల్లో భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాంటి అత్యంత క్లిష్టమైన సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన ప్రదర్శించిన నాయకత్వ పటిమ అద్భుతం. దేశానికి కాపలా కాసే సైనికుడు, దేశానికి కూడు పెట్టే రైతు… ఈ ఇద్దరి ప్రాధాన్యతను గుర్తిస్తూ ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం భారత చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పిలుపుగా మారింది. ఒకవైపు సరిహద్దుల్లో సైన్యాన్ని ప్రోత్సహిస్తూనే, మరోవైపు దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచి ఆహార స్వయంసమృద్ధి సాధించడానికి ఆయన ఎంతో కృషి చేశారు.

1965 యుద్ధం ముగిసిన తర్వాత, రెండు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్‌లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌తో కలిసి 1966, జనవరి 10న చారిత్రాత్మక ‘తాష్కెంట్ ఒప్పందం’పై శాస్త్రి సంతకం చేశారు. అయితే, దురదృష్టవశాత్తు ఒప్పందం జరిగిన మరుసటి రోజే, అంటే 1966 జనవరి 11న, 61 ఏళ్ల వయసులో తాష్కెంట్‌లోనే ఆయన కన్నుమూశారు. లాల్ బహదూర్ శాస్త్రి మనమధ్య నుంచి వెళ్లి దశాబ్దాలు గడుస్తున్నా, ఆయన కనబరిచిన నిరాడంబరత, ప్రజాసేవ, సంక్షోభ సమయంలో చూపిన దృఢమైన నాయకత్వం నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. ఆ మహానీయుడు అందించిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఇప్పటికీ నవభారత నిర్మాణంలో మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది.