Teacher Job Without TET Qualification in Kurnool: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కర్నూలు జిల్లాలో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత లేకుండానే ప్రభాకర్ అనే వ్యక్తి క్రీడా కోటాలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉద్యోగం పొందినట్లు నిర్ధారణ అయింది. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో.. కర్నూలు డీఈఓ సుధాకర్ విచారణ చేపట్టారు.
కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న ప్రభాకర్ టెట్ అర్హత సాధించకుండానే ఉద్యోగం పొందినట్లు విచారణలో తేలింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఈ అంశాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని డీఈఓ సిఫార్సు చేశారు. ప్రభాకర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసిన సమయంలో టెట్ పేపర్-2ఏలో 77 మార్కులతో అర్హత సాధించాడు. అయితే ఎస్జీటీ పోస్టుకు అవసరమైన పేపర్-1ఏలో అర్హత సాధించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ స్పోర్ట్స్ కోటా కారణంగా తనకు ఉద్యోగం లభించిందని తాను భావించినట్లు డీఈఓ విచారణలో ప్రభాకర్ చెప్పినట్లు సమాచారం.
సర్టిఫికెట్ల పరిశీలన దశలోనే టెట్ అర్హతకు సంబంధించిన అంశం బయటపడాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఎలాంటి లోపాలు జరిగాయి?, ధ్రువపత్రాల పరిశీలనలో బాధ్యత వహించిన అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై విద్యాశాఖ మరింత లోతుగా విచారణ చేయనుంది. మరోవైపు డీఎస్సీ నియామకాలకు సంబంధించి మరికొందరు అభ్యర్థులపైనా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటిపైనా అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫిర్యాదును పరిశీలిస్తూ అర్హతలు, సర్టిఫికెట్లు, నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించారా? లేదా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. టెట్ అర్హత, డీఎస్సీ నియామకాల్లో నిబంధనల అమలు విషయంలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.

