KRMB : కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) భేటీకి ఆంధ్రప్రదేశ్ హాజరుకాకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తెలంగాణ అధికారులు ఈ చర్యను KRMB authority పట్ల కనీస గౌరవం లేకపోవడంగా అభివర్ణించారు. గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీ నీటి పంపిణీకి అంగీకరించినప్పటికీ, తాజా భేటీకి హాజరుకాకపోవడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు KRMBపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం తన హాజరును నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. గత భేటీలో నిర్ణయించుకున్న నీటి పంపిణీ విషయమై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా, 23 టీఎంసీ నీటి పంపిణీకి గతంలో ఆంధ్రప్రదేశ్ అంగీకరించినప్పటికీ, ఇప్పుడు సమావేశానికి రాకపోవడం అనుమానాస్పదమని తెలంగాణ పేర్కొంది.
ఈరోజు జరిగిన భేటీ నిరవధికంగా వాయిదా పడటంతో, రేపు ఉదయం 11 గంటలకు మరోసారి KRMB సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేసింది.
తెలంగాణ అధికారులు KRMB సమావేశంలో మరికొన్ని కీలక డిమాండ్లను ఉంచారు:
ఏపీ అక్రమ నీటి తరలింపును నిలిపివేయాలి – మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి అక్రమంగా నీటిని తరలించడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం నీటిని ముట్టుకోవద్దు – శ్రీశైలం జలాలను ఏపీ అనధికారికంగా వినియోగించకూడదని తెలంగాణ స్పష్టం చేసింది.
నాగార్జునసాగర్ నుంచి అక్రమంగా నీటిని తీసుకోకూడదు – రైట్ కెనాల్ ద్వారా ఏపీ తలపెట్టిన నీటి తరలింపును ఆపాలని తెలంగాణ కోరింది.
ఈరోజు భేటీ మినెట్స్ తీసుకోవాలి – ఈరోజు జరిగిన భేటీని అధికారికంగా మినెట్ చేయాలని KRMBను తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు.
రేపు జరగనున్న KRMB భేటీలో కృష్ణా జలాల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ముఖ్యంగా, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకం అంశం కొలిక్కి వచ్చేలా ఈ భేటీలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. KRMB సమావేశానికి ఏపీ హాజరయ్యేనా? లేక మళ్లీ వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.