Site icon NTV Telugu

Krishna: శృతిమించుతున్న ఇసుక మాఫియా ఆగడాలు

Pamarru

Pamarru

Krishna: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ పథకం కొందరికి వరంగా మారితే, పామర్రు నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే గనిగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, నది గర్భాన్ని ఛిద్రం చేస్తూ ఇసుక మాఫియా సాగిస్తున్న దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

పామర్రు నియోజకవర్గ పరిధిలోని రొయ్యూరు, లంకపల్లి, తోట్లవల్లూరు ఇసుక రీచ్‌లు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అధికార పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒక సిండికేట్‌గా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. పేరుకు అనుమతులు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం మైనింగ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. మైనింగ్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయాల్లోనే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నాయి. తోట్లవల్లూరు రీచ్‌ను కావాలనే మూసివేసి, రొయ్యూరు, లంకపల్లి రీచ్‌ల ద్వారా దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Stress Management Tips: మీరు ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

ప్రభుత్వం లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించి ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని చెబుతున్నా, పామర్రులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక లారీ ఇసుక లోడింగ్ చేయాలంటే లారీ యజమానుల నుంచి 8,000 నుండి 12,000 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల వెనుక సురేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ కొందరు మండల స్థాయి నేతలు ఈ దందాను చక్కబెడుతున్నారని సమాచారం.

అడ్డగోలు తవ్వకాల వల్ల కృష్ణా నది గర్భం రూపురేఖలు మారిపోతున్నాయి. పరిమితికి మించి లోతుగా తవ్వకాలు జరపడం వల్ల నదీ వ్యవస్థ దెబ్బతింటోంది. భారీ టిప్పర్లు ఇరుకైన రోడ్లపై అతివేగంగా, ఓవర్ లోడింగ్‌తో ప్రయాణిస్తుండటంతో చాగంటిపాడు వంటి గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కళ్ల ముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ప్రతిరోజూ 100 నుండి 150 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతోనే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వర్ల కుమార్ రాజా అనుచరులే ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. సామాన్యుడికి చేరాల్సిన ఉచిత ఇసుకను అక్రమార్కుల పాలు కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది.

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మృత్యు ప్రయాణం.. పలువురు మృతి

Exit mobile version