Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్‌..!

  • థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్‌ 2026 మ్యాచ్‌..
  • నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్రాంతి గౌడ్‌..
  • 8 బంతుల్లోనే అజేయంగా 15 పరుగులు..
  • పురుషుల, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున నెం.11 బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు..
Kranti Goud

Kranti Goud

Kranti Goud Creates History: దుబాయ్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్‌ 2026 తొలి మ్యాచ్‌లో.. భారత ఫాస్ట్ బౌలర్‌ క్రాంతి గౌడ్‌ బల్ తో మాత్రమే కాకుండా బ్యాట్‌ తోనూ అదరగొట్టింది. సాధారణంగా కొత్త బంతితో బౌలింగ్‌లో తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించే క్రాంతి గౌడ్.. ఈ మ్యాచ్‌లో నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఊహించని ఇన్నింగ్స్‌ ఆడింది. కేవలం 8 బంతుల్లోనే 15 పరుగులతో అజేయంగా నిలిచి భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

భారత ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో 11వ నంబర్‌ బ్యాటర్‌గా క్రాంతి గౌడ్‌ క్రీజులోకి వచ్చింది. అప్పటికే భారత మిడిలార్డర్‌ తడబడటంతో జట్టు భారీ స్కోరు చేసే పరిస్థితిలో కనిపించలేదు. అయితే క్రాంతి చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 159 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర వహించింది. క్రాంతి గౌడ్‌ 8 బంతుల్లో అజేయంగా 15 పరుగులు చేసింది. ఇందులో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా థిపచ్చా పుత్తావాంగ్‌ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదడంతో ఈ స్కోరు అందుకుంది.

ఈ పరుగులతో అటు పురుషుల, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున 11వ నంబర్‌ బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా క్రాంతి గౌడ్‌ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత నెం.11 స్థానంలో ఎవరూ టీ20 అంతర్జాతీయాల్లో రెండంకెల స్కోరు చేయలేదు. గతంలో ఈ రికార్డు ఇదివరకు శ్రీ చరణి పేరిట ఉండేది. ఆమె 2026లో దక్షిణాఫ్రికాపై 3 బంతుల్లో అజేయంగా 7 పరుగులు చేసింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. థాయ్‌లాండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్మృతి మంధాన 10 బంతుల్లో 19 పరుగులు చేసి రనౌట్‌ కాగా, ప్రతికా రావల్‌ 18 బంతుల్లో 22 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. షఫాలీ వర్మ మాత్రం 36 బంతుల్లో 64 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిగిలిన మిడిలార్డర్‌ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. రిచా ఘోష్‌ అయితే ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది.

ఒక దశలో 127/5గా ఉన్న భారత్‌ స్కోరు కేవలం 2.2 ఓవర్లలో 137/9కు పడిపోయింది. దీంతో టెయిలెండర్లు న్‌ శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌పై బాధ్యత పడింది. ఇద్దరూ చివరి వరకు నిలవడంతో భారత్‌ చివరకి 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఇక 160 పరుగుల లక్ష్య చేధనకు వచ్చిన థాయ్‌లాండ్‌ జట్టు బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు నిలబడలేకపోయారు. కేవలం 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో భారత్ 94 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.