కార్తీక మాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కల్యాణోత్సవాలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్న ఈ ఉత్సవాల్లో, నవంబర్ 22 ఆదివారం తొమ్మిదో రోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కార్తీక ఆదివారం, ప్రదోష పర్వదినం సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమాలను ఈ క్రింది లింక్లో వీక్షించండి.
పీఠాధిపతి సందేశం.. ప్రవచనామృతం
తొమ్మిదో రోజు వేడుకల్లో భాగంగా మూలామ్నాయ కంచి సర్వజ్ఞ పీఠాధిపతీశ్వరులైన జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం భక్తులకు మార్గదర్శనం చేయనుంది. స్వామీజీ ఆశీస్సులు, ఆధ్యాత్మిక సందేశాలు నేటి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నందూరి శ్రీనివాస్ ప్రవచనామృతం వినిపిస్తూ, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక అంశాలపై భక్తులకు సందేశం అందించనున్నారు.
విశేష పూజలు.. భక్తుల కుంకుమ అర్చన
వేదికపై కంచి కామాక్షి మహాభిషేకం, చందనాలంకార దర్శనం, కోటి సుపుష్పకుంకుమల సమర్పణోత్సవం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి వంటి విశేష పూజలు, అభిషేకాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. మరోవైపు భక్తుల చేతుల మీదుగా కంచి కామాక్షి విగ్రహాలకు పసుపు కుంకుమల అర్చన నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందే అవకాశం కల్పిస్తున్నారు.
మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం.. పల్లకి సేవ
నేటి వేడుకల్లో ప్రధాన ఘట్టంగా మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం కన్నులపండువగా జరగనుంది. కార్యక్రమాల ముగింపులో పల్లకి వాహన సేవ, సప్తహారతులు, స్వర్ణ లింగోద్భవం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు హాజరవుతున్న ఈ కోటి దీపోత్సవ తొమ్మిదో రోజు వేడుకల్లో పాల్గొనాలని రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.

