Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!

  • స్వామీజీల అనుగ్రహ భాషణం
  • శ్రీహరికి మహాభిషేకం
  • వైభవంగా శ్రీనివాస కల్యాణం
  • స్వామివారికి గరుడ వాహన సేవ
Day15

Day15

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఉత్సవాల్లో 15వ రోజు అయిన నవంబర్ 28, శనివారం (కార్తీక బహుళ పంచమి) పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణ మహోత్సవం వంటి విశేష ఘట్టాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. ఈరోజు కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లింక్ లో వీక్షించండి.

అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం

ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా బాలాపూర్‌కు చెందిన శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ, మహామండలేశ్వర్ శ్రీ సిద్ధేశ్వరగిరి మహారాజ్ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. అనంతరం అష్టావధాని డా. ధూళిపాళ్ల మహాదేవమణి ఆధ్యాత్మిక ప్రవచనామృతం వినిపించనున్నారు.

పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ

వేదికపై శ్రీహరికి మహాభిషేకం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహించనుండగా, భక్తులచే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కోటిపుష్పార్చన కార్యక్రమం జరగనుంది. భక్తుల సమక్షంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. చివరిగా స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు.. నిర్వాహకుల ఆహ్వానం

కార్తీక మాసంలో జరిగే ఈ కార్యక్రమాలు భక్తులకు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం, గరుడ వాహన సేవ నేటి కోటి దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఏడాది లాగే పూజా సామగ్రిని ఉచితంగా అందిస్తున్న రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఈ కోటి దీప యజ్ఞంలో పాల్గొనాలని భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.