NTV Telugu Site icon

Koti Deepotsavam 7th Day: మొట్టమొదటిసారిగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కల్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 7th Day: భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఏడో రోజు ఘనంగా ముగిసింది. నవంబర్‌ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది.

ఏడో రోజు కోటి దీపోత్సవం వేదికైన ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఇక, తొలి కార్తిక సోమవారం నాడు కోటిదీపోత్సవం వేదికగా భక్తులచే నర్మదా బాణలింగానికి కోటిభస్మార్చన జరిగింది. కోటిదీపోత్సవం వేదికగా తొలిసారిగా అగ్నిలింగక్షేత్రం తిరువణ్ణామలై శ్రీఅరుణాచలేశ్వరస్వామి కల్యాణాన్ని భక్తులు తిలకించారు. నందివాహనం ఆది దంపతుల దర్శనం చేసుకుని భక్తులు తరించిపోయారు. భక్తజనానికి కంచికామాక్షి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శన భాగ్యం కలిగింది. శివగంగ మఠాధిపతి శ్రీపురుషోత్తమ భారతి మహాస్వామి ఆశీర్వచనం చేశారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతాన్ని వినిపించారు. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో ఏడో రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. ఆరవ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోత్సవ వేదిక జనసంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..

 

Show comments